అసిస్టెంట్ ఎస్పీ బాధ్యతల స్వీకరణ
దేవరకొండ : దేవరకొండ అసిస్టెంట్ ఎస్పీగా పి.మౌనిక బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన గిరిబాబు బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లడంతో తెలంగాణ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన మౌనిక దేవరకొండ అసిస్టెంట్ ఎస్పీగా నియమితులయ్యారు. ఏఎస్పీ మౌనిక గతంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యేక కార్యాచరణతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా పంచాయతీ అధికారిగా వెంకయ్య
నల్లగొండ : జిల్లా పంచాయతీ అధికారిగా వెంకయ్య రానున్నారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న మురళిని బదిలీ చేశారు. వెంకయ్య మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నల్లగొండకు రానున్నారు. మురళి పంచాయతీల పర్యవేక్షణ విషయంలో పట్టిపట్టనట్లుగా వ్యవహరించడంతో పాటు పని చేయని కార్యదర్శులపై చర్యలు తీసుకోకపోవడం, కార్యాలయానికే పరిమితం అవుతుండటంతో కలెక్టర్ కొంత కాలంగా ఆయన్ను మందలిస్తున్నట్లు సమాచారం. అయినా పనితీరులో మార్పు రాకపోవడంతో ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.
బుద్ధవనం సందర్శన
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ట్రైకార్) చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి విగ్రహాన్ని, పాదాలను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బుద్ధుడి జీవిత చరిత్రను తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ నాగేశ్వర్‌రావు, సఫావత్ పాండునాయక్, మేరావత్ మునినాయక్, హరినాయక్, రాజు, సూరి, లాలు, నరేష్ తదితరులు ఉన్నారు.
సివిల్ సప్లయీస్ హమాలీల సమ్మె
నల్లగొండ టౌన్ : ప్రజా పంపిణీ పథకం కింద రేషన్ బియ్యం గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీలు బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నల్లగొండలోని గోదాం వద్ద సివిల్ సప్లయీస్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం యూనియన్లతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఒప్పందాన్ని అమలు చేయనందుకు నిరసనగా హమాలీలు నిరవధిక సమ్మె చేపట్టారన్నారు. సమ్మె వల్ల బుధవారం నుంచి ప్రజలకు రేషన్ బియ్యం అందే అవకాశం లేకుండా పోతుందన్నారు. హమాలీల సమస్య పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనకొండ వెంకటేశ్వర్లు, జానయ్య, నాగరాజు, బుచ్చయ్య, గిరి యాదయ్య, లింగయ్య, సైదులు, ఎల్లయ్య, రామస్వామి, జానీ శ్రీను, లక్ష్మయ్య, వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment