సైన్స్ ఫెయిర్ వాయిదా
నల్లగొండ: దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాప సూచకంగా ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించినందున ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించాల్సిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వాయిదా
నల్లగొండ: దేశ మాజీ ప్రధాని మన్మోమోహన్ సింగ్ మరణించిన కారణంగా నల్లగొండలో శనివారం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని వాయిదా వేశామని ఆ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన్మోహన్‌సింగ్ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించినందున జనవరి 3 వరకు పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
కొనసాగుతున్న ఫ్లోరోసిస్ సర్వే
మర్రిగూడ: మండల కేంద్రంలో కొనసాగుతున్న ఫ్లోరోసిస్ సర్వేను శుక్రవారం మర్రిగూడ పీహెచ్‌సీ వైద్యాధికారి శాలిని, వైద్యుడు దీపక్ పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు ఫ్లోరోసిస్ బాధితులను పరీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి వరకు 18,134 మందిని పరీక్షించామమన్నారు. 79 మంది గర్భిణుల్లో 20 మంది నుంచి యూరిన్ శాంపిళ్లు సేకరించామని తెలిపారు. వారి వెంట ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
సూర్యాపేట టౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన జీహెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ డీఈఓ అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23న సూర్యాపేట మండలం టేకుమట్ల జెడ్పీ హై స్కూల్‌ను డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ, జడ్జి శ్రీవాణి తనిఖీ చేశారు. విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడంతో ఆరా తీశారు. భోజనం సరిగ్గా ఉండడం లేదని, మాడిపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు జడ్జికి తెలిపారు. దీంతో సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో హెడ్మాస్టర్ పాపయ్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేయాలని డీఈఓ అశోక్‌ను కలెక్టర్ ఆదేశించారు. విచారణలో వాస్తవాలు తేలడంతో హెడ్మాస్టర్ పాపయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కనుల పండువగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం కనులపండువగా నిర్వహించారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలతో అలంకరించి, ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని తీర్చిదిద్ది ఊంజల్ సేవోత్సవం చేపట్టారు. అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయపూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టి గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు. అదే విధగా ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవికి పూజలు చేసి, శ్రీరంగనాథుడిని కొలుస్తూ పాశురాలు పఠించారు.
31 వరకు బ్యాంకు సేవలు నిలిపివేత
సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో విలీనం చేస్తున్నందున శనివారం నుంచి ఈనెల 31 వరకు బ్యాంకింగ్ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీజీవీబీ బ్యాంకు చీఫ్ మేనేజర్ అజయ్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట బ్రాంచ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని, ఖాతాదారులు సహకరించాలని కోరారు. ఖాతా నంబర్ మారదని, బ్యాంకుకు సంబంధించిన సందేహాలు ఉంటే బ్రాంచ్‌లో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment