నేడు ‘భరోసా’ సంబరాలు
నల్లగొండ : గణతంత్ర దినోత్సవం నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6న సంబరాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నదాతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు నిర్వహించాలని తెలిపారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొని సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.
సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో పలు యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి ప్రలోభపెట్టి ప్రజల బ్యాంకు అకౌంట్ నుంచి నగదు దోచుకుంటారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటన నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిందని ఈ కేసులో సైబర్ నేరగాళ్లు ఒక బాధితుడుకి సుమారు రూ.2 కోట్లను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయించి మోసగించారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని చెప్పే మాటలు, మెసేజ్‌లు నమ్మి మోసపోవద్దని, సంఘటన జరిగిన వెంటనే బాధితులు 1930కి ఫోన్ చేయాలని సూచించారు. సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్లకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.
ఇంటింటికీ
మిషన్ భగీరథ నీరిస్తాం
మునుగోడు : ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మునుగోడు మండలంలోని రత్తిపల్లి, సింగారం, ఊకొండి తదితర గ్రామాల్లో పర్యటించి మిషన్ భగీరథ నీటి సరఫరాను ఆయన పరిశీలించారు. ప్రజల వద్దకు వెళ్లి నీటి సరఫరా సక్రమంగా ఉందా.. ఎప్పుడైనా రోజుల తరబడి సరఫరా కావడంలేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట ఏఈ మణిదీప్, రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాదగోని రాజేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
నారసింహుడికి మొక్కులు
యాదగిరిగుట్ట : పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అదే విధంగా ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. స్వామి సన్నిధికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఆయా వేడుకల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment