ఆసుపత్రి ప్రాంగణంలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పక్కన కలెక్టర్, వైద్య అధికారులు
రామగిరి(నల్లగొండ) : రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శివు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి పరిశీలించారు. ఆంటినేటల్ పరీక్షల తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణులు, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోస్ట్ నేటల్ వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నల్లగొండ జనరల్ ఆసుపత్రితో పాటు మిర్యాలగూడ, దేవరకొండ ఆసుపత్రుల్లో కూడా ఆధునాతన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
గిరిజన జనాభా ఉన్న ఈ రెండు ఆసుపత్రులకు ఎలాంటి పరికరాలు కావాలో కలెక్టర్‌తో కలిసి పరిశీలించి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెస్ట్ డాక్టర్‌కు ప్రతి నెల రూ.15000 పారితోషకం ఇస్తామని ఇది వరకే ప్రకటించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అనంతరం మంత్రి స్థానిక ఐటీఐలో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జిజిహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపారాణి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment