కలిసి భోజనం చేసి.. సమస్యలు తెలుసుకుని
బాలికల గురుకుల
విద్యార్థులతో సంభాషణ సాగిందిలా..
భట్టి: డైట్ చార్జీలు పెంచాం కదా.. భోజనం ఎలా ఉంది ఇప్పుడు
విద్యార్థినులు: చాలా బాగుంది సార్.. మంచి భోజనం తినగలుగుతున్నాం
భట్టి: కూరలు రుచిగా ఉంటున్నాయా, సమయానికి పెడుతున్నారా
విద్యార్థినులు: ఉంటున్నాయి సర్, సమయానికి భోజనం అందజేస్తున్నారు
భట్టి: మోనూ ప్రకారం స్నాక్స్ ఇస్తున్నారా
విద్యార్థినులు: ప్రస్తుతానికి అన్నీ ఇస్తున్నారు. స్నాక్స్ బాగుంటున్నాయి సార్
భట్టి: మటన్, చికెన్ ఎలా ఉంటుంది.. అడిగినంత పెడుతున్నారా..
విద్యార్థినులు: బిర్యాని రైస్‌తో మటన్, చికెన్ పెడుతున్నారు. రుచిగా ఉంటుంది సార్
భట్టి: ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా
విద్యార్థినులు: చేస్తున్నారు సార్
భట్టి: ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా
విద్యార్థినులు: తలిదండ్రులు తీసుకువచ్చే స్నాక్స్‌ను అనుమతించడం లేదు సార్. వా టిని తిరిగి అనాథశ్రమాలకు పంపుతున్నారు.
బీబీనగర్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం బీబీనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నూతన మెనూ అమలు, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, సమస్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే ఆవరణలో నిర్వహిస్తున్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. కిచెన్, డైనింగ్‌హాల్, కూరగాయలు, తదితర వంట సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపాల్, వంట సిబ్బందితో మాట్లాడారు. నూతన మెనూ ప్రకారం భోజనం అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోటీపడి డిప్యూటీ సీఎంతో సెల్ఫీలు దిగారు. ఉప ముఖ్యమంత్రికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు గంగాధర్, వీరారెడ్డి, విద్యార్థులు స్వాగతం పలికారు.
వేతనాలు పెంచాలంటూ వేడుకోలు
వేతనాలు పెంచాలని ఎస్సీ బాలికల వసతిగృహంలోని వంట సిబ్బంది డిప్యూటీ సీఎంకు విన్నవించారు. ఇదే హాస్టల్ ఆవరణలో కొనసాగుతున్న బీసీ గురుకుల హాస్టల్‌లో వంట సిబ్బందికి నెలకు రూ.15వేలు చెల్లిస్తున్నారని, తమకు రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ వేతన విషయమై చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు.
భోజనాలు ఓకే.. చదువుల్లో గ్రేడ్ పెంచండి
ఎస్సీ బాలిక హాస్టల్‌ను డిప్యూటీ సీఎం సందర్శించిన సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిత్యావసర వస్తువులను పరిశీలిస్తున్న క్రమంలో భట్టితో టీచర్లు నూతన డైట్ గురించి ప్రస్తావించారు. కొత్త డైట్ అమల్లోకి వచ్చాక పిల్లలు, తాము అదృష్టవంతులయ్యామని, వారంలో మూడుసార్లు చికెన్, మటన్ అందజేస్తున్నారని, స్నాక్స్‌లో కొత్త రకాలు ఇవ్వడం బాగుందన్నారు. అందుకు భట్టి నవ్వుతూ.. భోజనం ఓకే, చదువులో విద్యార్థుల గ్రేడ్ పెంచే భాద్యత తీసుకోవాలని టీచర్లకు సూచిచండంతో వారంతా చిరునవ్వులు చిందించారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
డిప్యూటీ సీఎం వస్తున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకున్నారు. అందరూ ఒకేసారి క్యాంపస్‌లోకి రావడంతో కొంత గందరగోళం నెలకొంది. బాలికల హాస్టళ్లు కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప మిగితా వారందరినీ బయటకు పంపాలంటూ భట్టి పోలీసులకు ఆదేశించి కారు ఎక్కి వెనుదిరిగారు. పార్టీ శ్రేణులను పోలీసులు దూరంగా పంపిన అనంతరం భట్టి తిరిగి క్యాంపస్‌లోకి వచ్చారు.
ఫ బీబీనగర్‌లో బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఫ కిచెన్, డైనింగ్‌హాల్, కూరగాయలు, కిరాణా సరుకుల తనిఖీ
ఫ హాస్టళ్లలో సమస్యలు, నూతన మెనూ అమలుతీరుపై ఆరా
Comments
Please login to add a commentAdd a comment