● 14 తులాల బంగారు ఆభరణాలు,
నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
నల్లగొండ: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో సోమవారం వెలుగులోకి వచ్చింది. టూటౌన్ ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ మేకల ప్రసాద్ కుమార్తె అమెరికాలో, కుమారుడు ఢిల్లీలో స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగకు ప్రసాద్ కుమార్తె అమెరికా నుంచి నల్లగొండకు వచ్చింది. పండుగ తర్వాత ఈ నెల 17న కుమార్తె తిరిగి అమెరికాకు వెళ్తుండడంతో ఆమెను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దించేందుకు ప్రసాద్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. కుమార్తెను ఎయిర్‌పోర్టులో దించిన అనంతరం రెండు రోజులు హైదరాబాద్‌లోనే తమ బంధువుల ఇంట్లో ప్రసాద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. సోమవారం వారు నల్లగొండలోని ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి, తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. 14 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంలతో వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాఘవరావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment