గురుకుల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సూర్యాపేటటౌన్ : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలానికి కేటాయించిన మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో బీబీగూడేనికి చెందిన హర్షిత తొమ్మిదో తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఊరెళ్లిన హర్షితను సోమవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు తిరిగి పాఠశాలకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. పాఠశాలలోకి వచ్చిన అనంతరం తన లగేజ్ బ్యాగులను హాస్టల్ రూంలో ఉంచిన హర్షిత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన హర్షితను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో హర్షితను పాఠశాలకు రావాల్సిందిగా ఆమె తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది ఫోన్ చేశారని, పాఠశాలకు పంపిన కొద్ది సమయంలోనే ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని, దీనిపై విచారణ చేయాలని హర్షిత తల్లిదండ్రులు వల్లపు సైదులు, సరిత డిమాండ్ చేస్తున్నారు. అయితే హర్షిత అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఆమె హాజరుశాతం కూడా తక్కువగా ఉంటుందని ప్రిన్సిపాల్ చెప్పారు. విద్యార్థిని పాఠశాలలో సిబ్బంది ఎవరూ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసుతెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment