నేడు ఉమ్మడి జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు
మునగాల: సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం అండర్–11, 14, 17 విభాగాల్లో ఉమ్మడి జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండీ ఆజాంబాబా సోమవారం మునగాలలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు తాము చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన బోనఫైడ్ సర్టిఫికెట్‌తో ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు.
చికిత్స పొందుతూ
బాలిక మృతి
రాజాపేట: విష పురుగు కరవడంతో అనారోగ్యానికి గురైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆది వారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటన రాజాపేట మండలం నెమిల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమిల గ్రామానికి చెందిన వేముల మహేందర్‌గౌడ్, లలిత దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. చిన్న కుమార్తె కావ్య స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్దకు రేగుపండ్ల కోసం చిన్న బాబుతో కలిసి కావ్య వెళ్లింది. చెట్టు కింద పడ్డ రేగుపండ్లు తీస్తున్న క్రమంలో కావ్య చేతికి విషపురుగు కరిచింది. కావ్య గమనించకుండా చేతికి ముళ్లు కుచ్చుకుందేమో అని అనుకుంది. ఇంటికి వెళ్లాక రాత్రి 7గంటల సమయంలో తనకు వాంతి వస్తుందని తల్లితో కావ్య చెప్పడతో స్థానికంగా చికిత్స చేయించారు. శనివారం తెల్లవారుజామున కావ్య నోటి నుంచి నురగలు వస్తుండటంతో తల్లిదండ్రులు ఆమెను రాజా పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మొదట భువనగరికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది.
గ్యాస్ సిలిండర్ పేలి
ఇల్లు దగ్ధం
మోత్కూరు : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయ సమీపంలో రేకుల ఇంట్లో మెండె అండాలు నివాసముంటోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె ఆదివారం రాత్రి తన కుమారుడి ఇంట్లో నిద్రించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళఅండాలు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు కూలిపోయి వస్తువులన్నీ కాలిపోయాయి. కూలి పనిచేసి దాచుకున్న రూ.18 వేల నగదు, తులంన్నర బంగారం మంటల్లో కాలిపోయాయని బాధితురాలు పేర్కొంది. ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలు చల్లార్చినప్పటికీ అప్పటికే ఇల్లు మొత్తం కాలిబూడిదయ్యింది.
శిలాఫలకం ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
అడ్డగూడూరు: మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన మందుల శ్రీకాంత్ అదే గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆదివారం బైక్‌తో ధ్వంసం చేశాడు. దీంతో అతడిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment