పోలీస్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ముగిసిన
రైతు భరోసా భూ సర్వే
నల్గొండ అగ్రికల్చర్ : రైతు భరోసా పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న భూ సర్వే సోమవారం ముగిసింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు ఆధారంగా సర్వే నిర్వహించారు. 140 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూములు సాగుకు యోగ్యమైనవా.. లేదా అనే విషయాన్ని నిర్ధారించారు. సర్వే నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నప్పటికీ ఈనెల 21 నుంచి గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలో రైతుభరోసాకు అర్హుల జాబితాను ప్రకటించనున్నారు.
ప్రవేశపరీక్ష షెడ్యూల్ విడుదల
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశపరీక్ష షెడ్యూల్ విడుదలైనట్లు యాదాద్రి జోన్ అధికారి ఎస్.సంధ్యారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతిలో మిగిలిన సీట్లకు, గౌలిదొడ్డి ఎస్సీ సీఓఈ గురుకులంలో 9వ తరగతి, పరిగి ఎస్‌ఓఈలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎస్సీ గురుకులం రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్‌గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 23 వరకు tgcet.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.100 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
24న పానగల్లులో వేలం పాట
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో ఈ నెల 24న కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్మకానికి బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రాపోలు బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 24న ఉదయం 10.30 గంటల వరకు ఆలయం వద్దకు రావాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment