తుది ఓటరు జాబితా చేర్పుల్లో యువ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.నెల రోజుల్లో ఏకంగా 28 వేల మంది యువతీ, యువకులు ఓటరు జాబితాలో పేరు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి దరఖాస్తులను పరిశీలించి జనవరి 5న ప్రకటించే తుది జాబితాలో చేర్చేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తుది ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. – కర్నూలు(సెంట్రల్)
● యువ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన
● నెల రోజుల్లో ఏకంగా 28,039 మంది రిజిస్ట్రేషన్
● తుది ఓటరు జాబితా రూపకల్పనలో 37,396 ఓటర్లు పెరిగే అవకాశం
● పెండింగ్ ఫారాలను పరిష్కరించేదిశగా అధికారులు
● జనవరి 5న తుది ఓటరు జాబితా
విడుదలకు చర్యలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారులు అక్టోబర్ 27వ తేదీన ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అందులో జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కలిపి 18–19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య కేవలం 13,761 ఉండేది. ఈక్రమంలో 18–19 ఏళ్ల మధ్య ఉన్న యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశాలు రావడంతో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా 2023 అక్టోబర్ 27 నుంచి 2023 డిసెంబర్ 26వ తేదీ వరకు 41,800 మంది యువతీ, యువకులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ క్రమంలో రెండు నెలల్లో దాదాపు 28,039 మంది యువకులు కొత్తగా ఓటరుగా నమోదై రికార్డు సృష్టించారు. కాగా, పెరిగిన యువ ఓటర్లలో కర్నూలులో 2,929, పాణ్యంలో 5,165, పత్తికొండలో 3,194 మంది, కోడుమూరులో 3,776, ఎమ్మిగనూరులో 3,360, మంత్రాలయంలో 3,307, ఆదోనిలో 3,168, ఆలూరులో 3,140 మంది ఉన్నారు. అత్యధికంగా పాణ్యంలో 5,165 మంది ఓటర్లు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలులో 2,929 మంది ఉన్నారు.
తుది జాబితాలో పెరగనున్న
37,396 మంది కొత్త ఓటర్లు
మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు 2024 జనవరి 5వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముసాయిదా జాబితా విడుదలైనప్పటి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు దానిపై అభ్యంతరాలు స్వీకరించారు. ప్రస్తుతం వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితా ప్రకారం 19,71,325 మంది ఓటర్లు ఉండగా, ఆ సంఖ్య డిసెంబర్ 26వ తేదీ నాటికీ 20,08,721కు చేరుకుంది. అంటే రెండు నెలల్లో దాదాపు 37,396 మంది ఓటర్లు పెరిగారు. కాగా, కొత్తగా పెరిగిన ఓటర్లలో కర్నూలులో 743 మంది, పాణ్యంలో 13,383 మంది, కోడుమూరులో 8,886, ఎమ్మిగనూరులో 1,472, మంత్రాలయంలో 7,148, ఆదోనిలో 2,476, ఆలూరులో 3,258 మంది ఉన్నారు. కాగా పత్తికొండలో ఓటర్లు పెరగకపోవడంతో పాటు మృతి చెంది వారి పేర్లు తొలగించడంతో ఉన్న సంఖ్యకంటే తక్కువగా నమోదైంది.
తుది ఓటరు జాబితా
రూపకల్పనకు చర్యలు
2024 జనవరి 5న తుది ఓటరుజాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చిన ఫారం–6, 7, 8లను క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయించాం. చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాం. యువ ఓటర్లను జాబితాలో చేర్పించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికీ ఓటరుగా నమోదు కాని 18–19 ఏళ్ల మధ్య ఉన్న వారెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
– డాక్టర్ జి.సృజన, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment