అకాల వర్షం.. అపార నష్టం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

Published Thu, May 9 2024 6:40 AM

అకాల

ఈదురు గాలులు, కుండపోత వర్షం

అరటి రైతులకు భారీగా నష్టం

నేలకొరిగిన 400 విద్యుత్‌ స్తంభాలు,

కూలిపోయిన 40 ట్రాన్స్‌ఫార్మర్లు,

నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

నంద్యాల(అర్బన్‌)/గోస్పాడు/ఆళ్లగడ్డ/దొర్నిపాడు: జిల్లాలో మంగళవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు ఉరుములతో వర్షం కురిసింది. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. గోస్పాడు, గడివేముల, బండిఆత్మకూరు, మహానంది తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నంద్యాల పట్టణంలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. గాంధీచౌక్‌ సర్కిల్‌లో రోడ్డు పక్కనపెట్టుకున్న తోపుడు బండ్లు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సంజీవనగర్‌ గేటు, మున్సిపల్‌ ఆఫీసు, ఎస్‌బీఐ కాలనీ ఏటీఎం సెంటర్‌, సాయిబాబానగర్‌ ఆర్చి, చామకాల్వ సెంటర్‌, కోవెలకుంట్ల జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం మొదలైనప్పటి నుంచి ఉదయం 10.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణలో విద్యుత్‌ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. జాతీయ రహదారిపై, పలు మండలాల పరిధిలోని గ్రామాల్లో పెద్దపెద్ద వృక్షాలు నేలకూలాయి. మహానంది మండలంలో అరటి రైతులు భారీగా నష్టపోయారు. దాదాపు 750 ఎకరాల్లో అరటి చెట్లు నేలవాలడంతో రూ. 6 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రేకులషెడ్లు, పశువుల పాకలు గాలి వాన బీభత్సానికి ఎగిరిపడ్డాయి. చాపిరేవుల సమీపంలో జంగాల కులస్తుల గుడిసెలు కుప్పకూలడంతో రోడ్డున పడ్డారు. నంద్యాల విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 400 విద్యుత్‌ స్తంభాలతో పాటు 40 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో దాదాపు రూ.1.75 కోట్లు నష్టం వాటిల్లినట్లు విద్యుత్‌ శాఖ డీఈ రమణారెడ్డి తెలిపారు. గోస్పాడు మండలంలో 50 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చాగలమర్రి మండలంలో 76.4 మి.మీ వర్షపాతం నమోదైంది. రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అకాల వర్షం.. అపార నష్టం
1/1

అకాల వర్షం.. అపార నష్టం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement