గతంలో రైతు కమిటీలు.... | - | Sakshi
Sakshi News home page

గతంలో రైతు కమిటీలు....

Published Fri, Sep 27 2024 2:24 AM | Last Updated on Fri, Sep 27 2024 2:24 AM

గతంలో

చిన్న ట్రాన్స్‌ఫార్మర్లు రాక ముందు రైతుల వ్యవసాయ విద్యుత్‌ అవసరాల కోసం అధికారులు 60, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసే వారు. వీటి కింద విద్యుత్‌ కనెక్షన్‌ పొందే రైతులను కమిటీగా ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ బాధ్యతలను వారికి అప్పగించేవారు. అలాంటి విధానం ఆచరణలో కొంత వైఫల్యం చెందినా రైతుల్లో కొంత బాధ్యతను పెంచేవిధంగా ఉండేది. రైతులు తరచుగా ట్రాన్‌న్స్‌ఫార్మర్లను పరిశీలిస్తూ ఉండేవారు.

చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు గోపాల్‌. ప్యాపిలి సమీపంలో 11 ఎకరాల మామిడి తోటను గత కొద్ది సంవత్సరాలుగా కౌలుకు తీసుకుంటున్నాడు. ఈ ఏడాది కూడా లక్షలాది రూపాయలు వెచ్చించాడు. అంతర పంటగా టమాట సాగు చేశాడు. అయితే గత నెల 24వ తేదీ ఈ తోటలో ఉన్న ట్రాన్స్‌ఫార్మన్‌ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్‌వైర్‌, ఆయిల్‌ను తస్కరించారు. దీంతో నెల రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక పోవడంతో బోరు పని చేయలేదు. అప్పటి నుంచి నీటి సరఫరా లేక మామిడి చెట్లు ఎండిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. టమాట మొక్కలు సైతం ఎండిపోవడంతో పంటను తొలగించాడు.

పాత ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్‌ చేస్తున్న

దొంగలు

కాపర్‌ తీగలు, మోటార్లు,

విద్యుత్‌ తీగల అపహరణ

కేసు నమోదులో పోలీసుల జాప్యం

పంటలకు నీరు అందక

నష్టపోతున్న రైతులు

వారి కన్ను పడితే ట్రాన్స్‌ఫార్మర్లు బద్దలవ్వాల్సిందే. ఆయిల్‌ క్యాన్లు

నిండాల్సిందే. క్షణాల్లో కాపర్‌ తీగలు సంచిలోకి చేరాల్సిందే. వారు బరితెగిస్తే స్తంభాలపై విద్యుత్‌ ప్రవాహం ఉన్న తీగలు కూడా నేలకు దిగాల్సిందే. ప్రాణంతకమైన కరెంట్‌తో వారు దొంగాట ఆడుతారు. రూ. లక్షల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లను అవలీలగా ధ్వంసం చేసి ఖాళీ చేసేస్తారు. అటు రైతులకు, ఇటు విద్యుత్‌ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా కాపర్‌ కేటుగాళ్ల చోరీలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు పెరుగుతున్నా అధికారుల్లో చలనం కరువైంది. ఓ వైపు పోలీసులు కేసుల నమోదులో జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

నంద్యాల(అర్బన్‌)/ప్యాపిలి: ఆరుగాలం కష్టించే రైతుల పొలాల్లో దొంగలు పడ్డారు. పంటలకు నీరు పెట్టేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేస్తున్నారు. రూ. లక్షలు పెట్టి ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లను ఏర్పాటు చేసుకున్న రైతులు వరుస చోరీలతో బెంబేలెత్తిపోతున్నారు. చేతికొచ్చిన పంటకు నీరందక కళ్లేదుట ఎండుతుంటే కన్నీటీ పర్యంతమవుతున్నారు. రైతుల ఏడుపులు అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. రైతుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఊరికి దూరంగా ఉన్న పొలాలనే దొంగలు టార్గెట్‌ చేస్తున్నారు. పాత ట్రాన్స్‌ఫార్మర్లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. పది, పదిహేనేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లలో ఒక్కో దానిలో యావరేజ్‌గా 15 కేజీల కాపర్‌ ఉంటుంది. ఇలా దొంగతనం చేసిన కాపర్‌ వైర్‌తో పాటు ట్రాన్స్‌ఫార్మర్లలో వాడే ఆయిల్‌ను దొంగలు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ట్రాన్స్‌ఫార్మర్లలో రాగికి బదులు అల్యూమినిమం వాడుతూ ఉండడంతో దొంగలు పాతవాటినే టార్గెట్‌ చేసుకుంటున్నారు. మహానంది, ప్యాపిలి, కొత్తపల్లి, మిడుతూరు, బేతంచెర్ల, డోన్‌ మండలాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

కాపర్‌ వైర్‌ కేజీ నాలుగు వేల వరకు...

ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే కాపర్‌ వైర్‌ కిలో మూడు నుంచి నాలుగు వేల వరకు ఉంటుంది. చోరీ చేసిన వైర్‌ను వెయ్యి, రూ.1500 వందలకే దొంగలు విక్రయించేస్తున్నారు. చౌకగా వస్తుండడంతో వ్యాపారస్తులు కూడా గుట్టుచప్పుడు కాకుండా వీటిని కొనేస్తున్నారు. అలాగే పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఆయిల్‌ను కూడా దొంగలు చోరీ చేస్తున్నారు. మరోవైపు మోటార్లకు అమర్చే స్టార్టర్లను కూడా ఈజీగా ఎత్తుకెళ్లిపోతున్నారు. ఒక్కో స్టార్టర్‌ ఖరీదు సూమారుగా రూ.10 వేల వరకు ధర పలుకుతోంది. దొంగలు వీటిని సగం ధరకే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

దొంగల ముఠా ఏం చేస్తోందంటే..

ట్రాన్స్‌ఫార్మర్లను స్తంభం నుంచి తొలగించి దానిని పగులగొట్టి అందులో ఉన్న రాగి తీగను దొంగిలిస్తారు. సహజంగా ఇలాంటి పనులు చేయాలంటే విద్యుత్‌ పనులు తెలిసిసవారై ఉండాలి. ఇలాంటి చోరీల ముఠాలో విద్యుత్‌ గురించి తెలిసిన వారు ఒకరుంటారనేది గతంలో పట్టుబడిన దొంగల ద్వారా తెలిసింది. వీరు పగటి వేళల్లో తిరుగుతూ రాత్రి వేళల్లో అనువైన ప్రదేశాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతుంటారు. పగులగొట్టిన ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి వైరు వేరు చేసి అపహరించే క్రమంలో మిగిలిన పరికరాలను అక్కడే పడేసి వెళ్తుంటారు. పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న సమయంలో రాగివైరు దొంగిలిస్తే అధిక మొత్తంలో నగదు వచ్చేది. అయితే ఇప్పుడు రైతుల తోటల్లోనే చిన్న ట్రాన్స్‌ఫార్మర్లు (హెచ్‌వీడీఎస్‌) ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చోరీలు వరుసగా రెండు మూడు ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొడుతున్నారు. ఈ తరహా చోరీలు డోన్‌ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఏకంగా విద్యుత్‌ స్తంభాల తీగలనే కట్‌ చేసి అపహరించుకు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. గత రెండేళ్లలో 16 ట్రాన్స్‌ఫార్మర్ల కాయిల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లగా ఓ చోట కండెక్టర్‌, మరో చోట కేబుల్‌ వైర్‌ చోరీకి గురైంది. మొత్తం 13 ప్రాంతాలకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2024 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 3 ట్రాన్స్‌ఫార్మర్లు, రెండు వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు చోరీకి గురి కాగా ఒక్కటి మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ అయ్యింది. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామ సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందిన ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైంది. అదే విధంగా ఆళ్లగడ్డ, చాగలమర్రి, పాణ్యం మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురి కాగా రెండు చోట్ల మాత్రమే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

దొంగతనాలను అరికట్టాలి

మా మండలంలో పలు గ్రామాల్లో తరచూ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయి. నాకు తిమ్మరాజు కుంట సమీపంలో బావి కింద 10 ఎకరాల పొలం ఉంది. వేసవిలో పంటల సాగుకోసం రూ.40 వేలు పెట్టి విద్యుత్‌ మోటారు ఏర్పాటు చేసుకున్నా. అయితే ఈనెల 10వ తేదీన వ్యవసాయ మోటారు చోరీకి గురైంది. స్టార్టర్‌ కూడా అపహరించారు. చాలా మంది నష్టపోతున్నారు. చోరీలను అరికట్టేందుకు పోలీసులు గస్తీ పెంచాలి.– చంద్రశేఖర్‌ రెడ్డి,

రైతు, ఎదురుపాడు, కొత్తపల్లి మండలం

జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు ఇలా..

సంవత్సరం చోరీలు కేసు నమోదు

2023 11 9

2024 5 2

No comments yet. Be the first to comment!
Add a comment
గతంలో రైతు కమిటీలు.... 
1
1/2

గతంలో రైతు కమిటీలు....

గతంలో రైతు కమిటీలు.... 
2
2/2

గతంలో రైతు కమిటీలు....

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement