No Headline
సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని బాలికలను చిదిమేస్తున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే జంకుతున్నారు. మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ అరాచకపాలన సాగుతోంది. బాధితులకు న్యాయం గాలిలో దీపంగా మారింది. కూటమి సర్కారు ఏర్పడిన తొలి నెల లోనే (జూలై 7న) పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వివిధ వర్గాల ప్రజలు నినదించారు. బాధితులకు అండగా రోడ్డెక్కారు. అయినా, కూటమి సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. నాలుగు నెలలవుతున్నా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయింది. ఆది నుంచి ఈ విషయంలో సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ వస్తోంది వైఎస్సార్‌సీపీ. తాజాగా ఆదివారం ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ దారా సుధీర్ తదితరులు కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి న్యాయం జరిగే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ బిడ్డ ఆనవాళ్లు ఇప్పటి వరకు లభించలేదని, కనీసం తాము బిడ్డ అంత్యక్రియలు కూడా చేయలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. వీరి ఆవేదన వైఎస్సార్‌సీపీ నాయకులను కలచివేసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో న్యాయం అందని ద్రాక్షగా మారిందన్నారు. బిడ్డను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి అనిత పరామర్శించకపోవడం శోచనీయమన్నారు.
కూటమి వైఫల్యాన్ని నిలదీసి..
ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
పార్టీ తరఫున రూ.పది లక్షల
చెక్కు అందజేత
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను
తూర్పారబట్టిన నాయకులు
రాష్ట్రంలో అరాచక పాలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచక పాలన మొదలైంది. ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయింది. రోజూ ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు చిదిమేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ముచ్చుమర్రిలో నాలుగు నెలలు క్రితం ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. తర్వాత శవాన్ని మాయం చేశారు. ఇంత వరకు పోలీసులు కేసును ఛేదించకపోగా మృతదేహాన్ని ఇప్పటి వరకు గుర్తించకపోవడం దారుణం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని అమలు చేసి చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు రక్షణ కల్పించాలి.
– మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
నోరుమెదపని డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఆరాచక పాలన సాగుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరుమెదపడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్నారని ఆయన అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయనే అధికారంలో ఉన్నాడు. నాడు కనిపించకుండా పోయిన వారిని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగిస్తే సంతోషిస్తాం. ఇది చేయకపోగా కూటమి సర్కారు రెడ్‌బుక్ పేరుతో ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. అమాయకులపై దాడు లకు తెగబడుతోంది. మహిళలు, బాలికల రక్షణను గాలికి వదిలేసింది. – విరుపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే
రాష్ట్రాన్ని బిహార్‌గా మారుస్తున్నారు
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అత్యాచారాలు పెరిగిపోయాయి. అతిదారుణంగా చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. దసరా పండుగ రోజు హిందూపురంలో అత్తాకోడలిపై గ్యాంగ్ రేప్ జరిగితే.. దీపావళికి కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. రాష్ట్రాన్ని టీడీపీ నాయకులు బిహార్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హోంమంత్రిగా అనిత అన్‌ఫిట్. – ఇసాక్‌బాషా, ఎమ్మెల్సీ
మహిళలకు రక్షణ ఏదీ?
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ముచ్చుమర్రిలో చిన్నారిని హత్య చేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలేదు. చివరకు కుటుంబసభ్యులకు బాలిక శవం కూడా అప్పగించలేదు. ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. ఇందులో భాగంగానే మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మేము వారిని కలిసి అండగా నిలబడతామని భరోసా ఇచ్చాం. – డాక్టర్ దార సుధీర్, నందికొట్కూరు
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
ముచ్చుమర్రి ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు
ముచ్చుమర్రి గ్రామంలో హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించకపోవడం శోచనీయం. కేసు ఛేదనలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కనీసం అస్తికలైనా ఇస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని బాధిత కుటుంబం వేడుకుంటోంది. అయినా, ప్రభుత్వానికి చలనం లేదు. ఈ ప్రభుత్వం అత్యాచారాలు, హత్యలు చేసేవారికే కొమ్ముకాయడం చాలా బాధాకరం.
– పాపిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment