విరాళాల ముసుగులో బలవంతపు వసూళ్లు!
రూ.వంద చొప్పున
ఇవ్వాలన్నారు
వరద బాధితులకు విరాళం ఇవ్వాలనే విషయం మా గ్రూపు సభ్యులకు చెప్పలేదు. వివరాల ను నమోదు చేయాలని ఒక్కో సభ్యురాలు రూ. వంద చొప్పున ఇవ్వాలని అడిగారు. సభ్యులందరి నుంచి వసూలు చేసి మొత్తం కలిపి ఇస్తామని చెప్పాం. ఆ డబ్బు మాత్రం ఇంత వరకు మా దగ్గర నుంచి తీసుకోలేదు.
– పావని, పొదుపులక్ష్మి గ్రూపు సభ్యురాలు
రూ.8,600
విరాళం అందించాం
విజయవాడ వరదబాధితుల సహాయార్థం పొదుపు సంఘాల నుంచి రూ.8,600 విరాళాలు సేకరించి వెలుగు అధికారులకు అందజేశాం. అధికారుల సూచనల మేరకు పొదుపు సంఘాల సభ్యుల నుంచి విరాళాలు వసూలు చేశాం.
– అనసూయ, గ్రామైక్య సంఘం సభ్యురాలు
కోవెలకుంట్ల: గత సెప్టెంబర్‌లో బుడమేరు వరదలు విజయవాడ ప్రజలను అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా సర్వసం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు వేలాది మంది దాతలు ముందుకొచ్చి తమ వంతు విరాళమిచ్చి ఆదుకున్నారు. దాతలు ఇచ్చిన వరదసాయం పంపిణీలో టీడీపీ నాయకులు, కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించి బాధితులకు పరిహారం దక్కకుండా చేశారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. విజయవాడ వరద బాధితుల కోసం విరాళాల సేకరణలో జిల్లాలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి పొదుపు మహిళల నుంచి ఏకంగా రూ.30 లక్షలు వసూలు చేశారు.
వీఓఏలపై ఒత్తిడి
బుడమేరు వరద బాధితుల కోసం విరాళాలు వసూలు చేయాలని కొందరు జిల్లాస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు వరదబాధితుల విరాళాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. జిల్లాలోని ఆయా పొదుపు సంఘాల్లోని ప్రతి సభ్యురాలి నుంచి రూ.100 చొప్పున వసూలు చేసే బాధ్యతను ఆయా గ్రామాల వీఓఏలకు అప్పగించారు. జిల్లాలోని పలు మండలాల్లో వీఓఏలు పొదుపు మహిళల నుంచి బలవంతంగా విరాళాలను వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 29 మండలాల్లో డీఆర్‌డీఏ, మెప్మా పరిధిలో 30,105 పొదుపుసంఘాలు ఉండగా ఆ సంఘాల్లో 3.34 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 34 మంది ఏపీఎంలు, 152 మంది సీసీలు, 1,123 మంది వీఓఏలు పొదుపు సంఘాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఒక్కో మండలం నుంచి రూ.70 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు విరాళాల రూపంలో సేకరించి రూ.30 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇటీవల రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు. వాటిని వరద బాధితులకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని బాధితులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధుల వద్ద కేవలం మెప్పు పొందేందుకే డీఆర్‌డీఏ అధికారులు పొదుపు మహిళల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించినట్లు సమాచారం. విరాళాల రూపంలో నగదు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, గ్రామైక్య సంఘం, ఉన్నతి తదితర రుణాలు మంజూరులో కక్ష సాధింపు చర్యలు చేపడతారేమోనన్న భయంతో ఎక్కువ శాతం మంది మహిళలు విరాళాలు అందజేశారు.
ఒక్కో పొదుపు మహిళ నుంచి
రూ.వంద చొప్పున వసూలు చేయాలని
వీఓఏలపై ఒత్తిడి
ప్రజాప్రతినిధుల ప్రసన్నం కోసం
అధికారుల పాట్లు
Comments
Please login to add a commentAdd a comment