అట్టహాసంగా టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని పద్మావతినగర్ ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–17 విభాగంలో బాలబాలికలకు టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆదివారం ఎస్‌జీఎఫ్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర పరిశీలకులు శ్రావణ్‌కుమార్, నంద్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ శ్రీనాథ్ హాజరై మాట్లాడారు. 13 జిల్లాల నుంచి 130మంది క్రీడాకారులు, 50మంది క్రీడాధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్ర ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ కోచ్ ముంతాజ్‌బేగం, ఏపీరెడ్డి, దండె నాగరాజు, నాగేంద్ర, వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం
నంద్యాల: పట్టణంలోని కలెక్టరేట్ సెంటినరీ హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగనుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
5న బేస్‌బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 5వ తేది అండర్–14, 17 విభాగంలో బాల,బాలికలకు ఉమ్మడి జిల్లా బేస్‌బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లాల సెక్రటరీలు శ్రీనాథ్, గిడ్డయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామకృష్ణ పీజీ కాలేజీలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బీఫారం తీసుకొని రావాలన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
10లోగా స్వచ్ఛంద సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
నంద్యాల(అర్బన్): జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఈనెల 10లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా ఆదివారం ఒక ప్రకటన లో కోరారు. వివరాలకు సెల్: 08518–277864 నంబరును సంప్రదించాలన్నారు.
శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు
నంద్యాల: కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. ఆదివారం ఎస్పీ పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, బోగేశ్వరం వద్ద ప్రతి ఆది, సోమవారాల్లో ప్రజల సౌకర్యార్థం, ప్రధాన కూడళ్లు, రహదారి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాలను ఓవర్ టేక్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment