శ్రీశైలంలో కార్తీక రద్దీ
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక రద్దీ నెలకొంది. కార్తీక మాసం మొదటి ఆదివారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పూజా వేళలను మార్పులు చేసి వేకువజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీతో ఆలయ పురవీధులన్ని కిటకిటలాడాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీధిలో కార్తీకదీపారాధన చేసుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్దలతో లక్షవత్తులు, వెయ్యి వత్తులు, శివలింగాకార దీపాలు, ఓం నమఃశివాయ కారంలో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకున్నారు.
నేడు లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి..
కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని నేడు ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవస్థానం ఆధ్వర్యంలో పుష్కరిణి వద్ద లక్ష వత్తులను ఏర్పాటుచేస్తారు. భక్తులందరు వచ్చి ఉచితంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుని, దశవిధ హారతులను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment