రైతులపైనే బీమా భారం! | - | Sakshi
Sakshi News home page

రైతులపైనే బీమా భారం!

Published Mon, Nov 4 2024 1:24 AM | Last Updated on Mon, Nov 4 2024 1:24 AM

రైతుల

రైతులపైనే బీమా భారం!

కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోంది. ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందించకపోగా తాజాగా ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ఆ భారం రైతులపైనే వేసింది. దీంతో కూటమి ప్రభుత్వ పాలనలో తమకు అప్పులు తప్ప ఆదాయం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1.75 లక్షల హెక్టార్లలో వరి, కంది, మినుము, పెసర జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ, ఆముదం, ఉల్లి, తదితర పంటలు వేయాల్సి ఉంది. అయితే, ఆయా పంటలకు రైతులే బీమా ప్రీమియం చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నాడు అడుగడుగునా సాయం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులకు అడుగడుగునా సాయం అందించి ఆదుకుంది. గడిచిన ఐదేళ్లకాలంలో ప్రతి ఏటా రూ.13,500 పెట్టుబడిసాయం, గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు సరఫరా చేసింది. ప్రభుత్వమే ఆయా పంటలకు ఉచితంగా బీమా చెల్లించి అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటనష్టం సంభవిస్తే ఆయా సీజన్లలోనే పంటనష్టపరిహారం చెల్లించింది. వివిధ పంటల్లో రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విత్తనాలు, రసాయన ఎరువుల నాణ్యతను పరిశీలించుకునేందుకు ప్రతి నియోజకవర్గం కేంద్రంలో అగ్రిల్యాబ్‌లు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచింది. నంద్యాల జిల్లాలో 2021వ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించగా 89,199 మంది రైతులకు రూ. 123 కోట్లు, 2022వ సంవత్సరంలో 49,637 మంది రైతులకు దాదాపు రూ. 100 కోట్లను ఇన్సూరెన్స్‌ రూపంలో చెల్లించిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే. అయితే, ఐదునెలల క్రితం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు సర్కారు రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసింది.

డిసెంబర్‌ 15 లోపు ప్రీమియం చెల్లించాలి

ప్రభుత్వ ఆదేశాల మేరకు హెక్టారు శనగ పంటకు రూ. 210, ఉల్లికి రూ. 112, వేరుశనగకు రూ. 80, జొన్నకు రూ. 50, మినుముకు రూ. 49 చొప్పున డిసెంబర్‌ 15లోపు బీమా ప్రీమియం చెల్లించాలి. ఇదిలా ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి రబీ సీజన్‌ ప్రారంభం కాగా ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో 15 వేల హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. సీజన్‌ ప్రారంభమై నెల రోజులుగా దాటినా ఇప్పటి వరకు ఈ పంట నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలో ఖరీఫ్‌ పంటల కంటే రబీ పంటలకు ఉచిత పంటల బీమా అవసరం. ఉదాహరణకు కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో ప్రతి ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 20 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగవుతాయి. సబ్‌ డివిజన్‌లో రబీ సీజన్‌లో దాదాపు 75 వేల హెక్టార్లల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని వ్యవసాయ సబ్‌ డివిజన్లలో ఖరీఫ్‌ కంటే రబీలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. దీనికి తోడు రబీలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువశాతం పంట నష్టం సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో ఈ పంట నమోదు ఆధారంగానే పంటలబీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వర్తిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలకు ప్రీమియం చెల్లిస్తామని, రబీ పంటలకు రైతులే ప్రీమియం కట్టుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ సర్కార్‌ రెండు సీజన్లలో రైతులకు ఉచిత పంటల బీమా వర్తింప చేయగా ప్రస్తుత కూటమి సర్కార్‌ ఖరీఫ్‌ పంటలకే ఉచిత పంటల బీమా వర్తింప చేసి రబీ పంటల బీమా భారం రైతులపై మోపనుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంటలకు కూడా ఉచిత పంటల బీమా వర్తింప చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

రబీ పంటలకు ఉచిత బీమా

వర్తింపజేయాలి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఖరీఫ్‌, రబీసీజన్లకు సంబంధించి ఉచిత పంటల బీమా వర్తింప చేసింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటనష్టం సంభవిస్తే నష్ట పరిహారం అందించి ఆదుకుంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో ఐదు ఎకరాల్లో శనగ, జొన్న పంటలు సాగు చేయాల్సి ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పంటల బీమాకు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని రైతులే చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం విచారకరం.

– నాగయ్య, రైతు, కోవెలకుంట్ల

ఉచిత పంటల బీమా పథకానికి

కూటమి ప్రభుత్వం మంగళం

రబీ పంటలకు ప్రీమియం సాగు

దారులే చెల్లించాలని ఉత్తర్వులు

జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో

రబీ పంటల సాగు లక్ష్యం

గత ఐదేళ్లు రైతన్నపై

పైసా భారం పడకుండా చూసిన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
రైతులపైనే బీమా భారం!1
1/1

రైతులపైనే బీమా భారం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement