దంపతుల ఆత్మహత్యాయత్నం
బనగానపల్లె రూరల్: తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు చెందిన దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన యాగంటి క్షేత్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ దుగ్గిరెడ్డి తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ఐజకు చెందిన భార్గవ్, పల్లవి దంపతులు రెండు రోజుల క్రితం యాగంటి క్షేత్రానికి వచ్చారు. కుటుంబంలో నెలకొన్న ఆర్థిక సమస్యల కారణంగా పురుగు మందు తాగారు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్గవ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బంగారు వ్యాపారులకు టోకరా
బొమ్మలసత్రం: నంద్యాలలోని 25 మంది బంగారు వ్యాపారుల నుంచి ఓ కేటుగాడు రూ.12 లక్షలకు టోకరా పెట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక గాంధీచౌక్‌లో ఉన్న బంగారు వ్యాపారులకు ఒకరి తర్వాత మరొకరికి వివిధ నెంబర్ల నుంచి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేశాడు. తాను వన్‌టౌన్ ఎస్‌ఐ అని చెప్పి దొంగల నుంచి బంగారు నగలు కొన్నారని తమపై కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. కేసు నమోదు కాకుండా ఉండాలంటే కొంత నగదు ఫోన్‌పే ద్వారా చెల్లించాలని, ఆలస్యం చేయవద్దని బెదిరించాడు. దీంతో 25 మంది వ్యాపారులు ఒకరికి తెలియకుండా మరొకరు రూ.12 లక్షల వరకు నగదు బదిలీ చేశారు. తీరా స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆరా తీయగా ఆ నంబర్లకు స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐకి ఎటువంటి సంబంధం లేదని సీఐ సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
సాఫ్ట్‌వేర్ సంస్థపై కేసు నమోదు
బొమ్మలసత్రం: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.98 లక్షల మేర వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఎస్‌ఎల్‌సీ సొల్యూషన్స్ సంస్థపై టూటౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. సీఐ ఇస్మాయిల్ తెలిపిన వివరాలు.. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉప్పరి వెంకట్ హైదరాబాద్‌లోని గిజిలీజ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో రవిచంద్రారెడ్డి మరి కొంత మందితో కలిసి ఎస్‌ఎల్‌సీ సొల్యూషన్స్ పేరుతో సాఫ్ట్‌వేర్ సంస్థను నెలకొల్పారు. వివిధ రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని దాదాపు 78 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల నగదు వసూలు చేశారు. దాదాపు రూ.98 లక్షలు వసూలు చేసి కంపెనీ బోర్డు తిప్పేసి నిర్వాహకులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితుడు మద్దిలేటి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.
ఆకతాయికి జైలు శిక్ష
బండిఆత్మకూరు: మండలంలోని కడమల కాలువ గ్రామానికి చెందిన పెద్దస్వామికి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి 5 రోజులు జైలు శిక్ష విధించారని ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. పెద్దస్వామి మద్యం తాగి చుట్టుక్కల వారిని సభ్యత లేకుండా తిడుతున్నాడని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేసి నంద్యాల సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా 5 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని ఎస్‌ఐ తెలిపారు.
చిన్నకోతతో బాలునికి గుండె ఆపరేషన్
కర్నూలు(హాస్పిటల్): చిన్నకోతతో బాలునికి గుండె ఆపరేషన్‌ను విజయవంతం చేసినట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన ఖాజాబాషా(13)కు గుండెకు రంధ్రం ఉండటంతో కార్డియాలజీ విభాగం వైద్యులు కార్డియోథొరాసిక్ విభాగానికి రెఫర్ చేశారన్నారు. సాధారణంగా ఇలాంటి కేసులకు స్టెర్నం బోన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తామని, రక్తస్రావం ఎక్కువగా ఉంటుందన్నారు. గాయం మానేందుకు సైతం సమయం ఎక్కువగా తీసుకుంటుందని తెలిపారు. 13 ఏళ్ల బాలుడు కావడంతో ఛాతి పక్కలో ఆరు సెంటీమీటర్ల కోతతో సోమవారం ఆపరేషన్‌న్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మత్తుమందు వైద్యుడు కొండారెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర సహకారం అందించారన్నారు. ఇలాంటి ఆపరేషన్‌ను హైదరాబాద్, బెంగళూరులాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తారని, దీనికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా వసూలు చేస్తారన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. గుండెకు ఇలాంటి చిన్నకోత ఆపరేషన్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం కర్నూలులోనే నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment