వెన్నెల.. రాత్రంతా చీకట్లోనే!
● లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన తెనాలి యువతి ● శ్రీశైలం శిఖరం వద్ద 20 అడుగుల లోయలోకి దూకిన వైనం ● సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన పోలీసులు
శ్రీశైలం: లోన్ యాప్ వేధింపులను భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి దూకినా ఆమె అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా చిమ్మచీకట్లో, దట్టమైన అడవిలో ఎటు వెళ్లాలో తెలియక రాత్రంతా అక్కడే ఉండిపోయింది. భక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అతికష్టంపై యువతిని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌రావు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన బుర్రి వెన్నెల.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసమని సెల్‌ఫోన్‌లోని లోన్ యాప్ ద్వారా రూ.15 వేలు రుణం తీసుకుంది. నెలనెలా కంతులు కట్టింది. 5 రెట్లు ఎక్కువే కట్టినా ఇంకా డబ్బు కట్టాలని, లేకపోతే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పెడతామని యాప్ నిర్వాహకులు వేధిస్తుండటంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం చేరుకుని శిఖరేశ్వరం వద్ద రక్షణ గోడపై సెల్ ఫోన్, పర్సు పెట్టి 20 అడుగుల ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకింది. అక్కడి భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే చీకటి పడటంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం వేకువజామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టి యువతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తామని సెల్‌ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని సీఐ తెలిపారు. యువతిని కాపాడిన పోలీసు సిబ్బంది రవికుమార్, వెంకట్ నారాయణ, నాగవేణి, రఘునాథుడు, రాజేంద్ర కుమార్, ప్రసాద్, లాల్సాలతో పాటు సహకరించిన అటవీశాఖ సిబ్బంది, దేవస్థానం ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment