ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: స్థానిక రేడియో స్టేషన్‌లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన చంద్రశేఖర్, శ్రీకాంత్ రూ.18 లక్షలు తీసుకుని మోసం చేశారని మండల పరిధిలోని ఎదురూరు గ్రామానికి చెందిన శివకుమార్ ఎస్పీ బిందు మాధవ్‌కు ఫిర్యాదు చేశాడు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి సమస్యలను తెలుసుకుని, వినతులు స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన 123 ఫిర్యాదులను విచారించి త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● పెద్దాస్పత్రిత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన శివాజీ రూ.50 వేలు తీసుకుని మోసం చేశాడని నూతనపల్లె గ్రామానికి చెందిన వంశీనాథ్ ఫిర్యాదు చేశారు.
● కోట్ల రైల్వేస్టేషన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు ఏవీఆర్ ఇన్ఫోటెక్ అనే పేరుతో ఐడీ కార్డు ఇచ్చి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలానికి చెందిన ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
● కర్నూలుకు చెందిన రెహాన్ అనే వ్యక్తి న్యాయవాదిగా పరిచయం చేసుకుని బ్యాంకులోన్ ఇప్పిస్తానని, భూ సమస్యలు పరిష్కరిస్తానని రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఓర్వకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు.
● పంచలింగాల వద్ద ఎకరా 80 సెంట్ల పొలానికి డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు.
● ఆస్పరి మండలం కై రుప్పల గ్రామానికి చెందిన కుమ్మరి వీరభద్రి కొందరు వ్యక్తులతో కలిసి ఫోర్జరీ సంతకాలతో తనకు చెందిన ఎకరా 54 సెంట్ల పొలాన్ని ఆక్రమించుకున్నారని అదే గ్రామానికి చెందిన విజయ్‌మోహన్ ఫిర్యాదు చేశారు.
ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
పీజీఆర్‌ఎస్‌కు 123 ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment