అమడగుంట్లలో ఉద్రిక్తత
కోడుమూరు రూరల్: మండలంలోని అమడగుంట్ల గ్రామంలో రూ.32లక్షల ఉపాధి నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనులు అధికార టీడీపీలో చిచ్చు రేపాయి. టీడీపీకి చెందిన సర్పంచు వరలక్ష్మి గ్రామంలోని 4వ వార్డులో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నారు. గతంలోనే సర్పంచు ఇంటి ముందు సీసీ రోడ్డు ఉందని, మరోసారి రోడ్డు నిర్మాణం చేపట్టరాదంటూ టీడీపీలోని మరోవర్గానికి చెందిన క్రిష్ణారెడ్డి వర్గీయులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. అయినప్పటికీ సర్పంచు వర్గీయులు సోమవారం ఇదే ప్రాంతంలో సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వల నిర్మాణ పనులను చేపడుతుండడంతో క్రిష్ణారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న కోడుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని మండల ఇంజినీర్ గంగరాజు, పంచాయతీ కార్యదర్శి శంకరమ్మలతో కలిసి ఇరువర్గాలతో చర్చించారు. సర్పంచు వర్గీయులు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం లేదని, కేవలం డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. క్రిష్ణారెడ్డి వర్గీయులు మాట్లాడుతూ తాము అభివృద్ధి పనులను అడ్డుకోవడం లేదని, సర్పంచు ఇంటి వద్ద కాకుండా అవసరం ఉన్న ఎస్సీ, బీసీ కాలనీల్లో రోడ్డు వేయాలని, ఆలయం ఎదురుగా మురుగునీటి కాల్వ నిర్మాణం వద్దని కోరుతున్నామని చెప్పారు. దీంతో ఇరువర్గాలు మాట్లాడి మరోసారి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకుని ఏకాభిప్రాయంతో పనులు చేసుకోవాలని, అంతవరకు ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు. పీఆర్ ఏఈ గంగరాజు మాట్లాడుతూ గ్రామంలోని మిగతా చోట్ల రోడ్డు పనులు యథావిధిగా జరుగుతాయన్నారు.
టీడీపీలో చిచ్చురేపిన
సీసీ రోడ్ల నిర్మాణ పనులు
సర్పంచు ఇంటి ముందు
రోడ్డు వేయకుండా కోర్టు స్టే
సీసీ డ్రైన్ నిర్మాణ పనులను
అడ్డుకున్న మరో వర్గం నేతలు
Comments
Please login to add a commentAdd a comment