కేసీ పరిధిలో ఆయకట్టుకు నీరు లేనట్టే!
కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు కృష్ణా, తుంగభద్ర నదులే ప్రధాన జల వనరులు. ఈ నీటిపై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాల్లోనే 6 లక్షలకుపైగా ఆయకట్టు ఆధార పడి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతమున్న నీటిని తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి విచ్చల విడిగా వాడుకుంటోంది. ఫలితంగా ఈ ప్రభావం సీమ జిల్లాల సాగుపై పడింది. ఇప్పటికే ఇంజినీర్లు రబీలో ఆరుతడి పంటలకు మాత్రమే వారబందీగా నీరు ఇస్తామని ప్రకటించడతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో నేడు జరిగే సాగునీటి సలహా మండలి సమావేశంలో శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్‌పై జిల్లా నేతలు గళం విప్పాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు శ్రీశైలం కనీన నీటి మట్టం 854 అడుగులు ఉండేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయకట్టుదారులు కోరుకుంటున్నారు.
నీరున్నా ఆరుతడి పంటలకే
తెలుగుగంగ కాలువ పరిధిలో నంద్యాల జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తానికి నీరు ఇచ్చేందుకు వెలుగోడు రిజర్వాయర్‌లో 15.787 టీఎంసీల నీరు ఉంది. అయితే, రబీలో వరి సాగు చేస్తే నీరు ఇవ్వలేమని, కేవలం ఆరుతడి పంటలకు, అది కూడా వారబందీగా ఇచ్చేందుకు సాధ్యమవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెలుగుగంగ కాలువ ఆధునికీకరణ పనులు చేసి ఈ కాల్వ చరిత్రలో మొదటిసారి రబీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు ఇచ్చింది.
ఎస్‌ఆర్‌బీసీ పరిధిలో ప్రశ్నార్థకం
12.4 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరుకల్లు రిజర్వాయర్‌ను 2014లో చంద్రబాబు 3.36 టీఎంసీలు నిల్వ చేసి హడావుడిగా ప్రారంభించారు. ఫలితంగా రబీలో ఈ రిజర్వాయర్ ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేకపోయారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 11.2 టీఎంసీలు గోరుకల్లులో నిల్వ ఉంచి ఎస్‌ఆర్‌బీసీ పరిధిలో 2021–22లో 94 వేల ఎకరాలు, 2022–23లో 1.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందించారు.
హంద్రీనీవాకు క‘న్నీటి’ కష్టాలే...!
హంద్రీనీవా కాలువ వెంబడి రైతులు పంటలు సాగు చేశారు. కాల్వలో 1688 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తుంది. ఈ కాలువ కింద 40 వేల ఎకరాలకుపైగా సాగు చేశారు. కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లలో సైతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేదు. ఇలాంటి సమయంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో తగ్గిపోతున్న నీటి మట్టంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పాటు 79 చెరువులకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇంత వరకు 30 చెరువులకు మాత్రమే నీటిని నింపారు. అన్ని చెరువులకు నీరు నింపి ఉంటే 10 వేల ఎకరాల ఆయకట్టు సాగు అయ్యేది.
నీటి లభ్యత ఆధారంగా నీరిస్తాం
పవర్ జనరేషన్ నిలిపి వేయాలని తెలంగాణ జెన్‌కోకు ఎన్ని సార్లు లేఖలు రాసినా, కేఆర్‌ఎంబీ వారు సైతం హెచ్చరించినా విద్యుత్ ఉత్పాదన నిలిపి వేయడం లేదు. వెలుగుగోడు, గోరుకల్లు రిజర్వాయర్లలో ఉండే నీటి ఆధారంగా ఆరుతడి పంటలకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేసీ కెనాల్ పరిధిలో రెండో పంటకు నీరు ఇచ్చేందుకు సాధ్యం కాదు.
– కబీర్ బాషా,
జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ
కర్నూలు–కడప కాలువ పరిధిలో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వకు 39.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో టీబీ డ్యాంలోని నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు, నది ప్రవాహం నుంచి 29.9 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని వినియోగించేందుకు మల్యాల దగ్గర రెండు పంపులు, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం చేపట్టారు. అయితే, శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిల్వలో రోజు 3 టీఎంసీలకుపైగా పవర్ జనరేషన్ పేరుతో దిగువకు పోతుంది. మరోవైపు టీబీ డ్యాంలోకి ఈ ఏడాది వచ్చిన నీటి ఆధారంగా 9.08 టీఎంసీ నీరు కేటాయించారు. ఇందులో మనం చుక్క నీరు కూడా వాడుకోలేదు. అయితే, ఈ నీటిని తాగునీటి అవసరాల పేరుతో అనంతపురం జిల్లా పాలకులు హెచ్చెల్సీ ద్వారా మళ్లీంచుకునేందుకు సిద్ధమవుతుండడంతో ఇక్కడి రబీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని జల వనరుల శాఖ ఇంజినీర్లు సంకేతాలు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment