ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వినతులకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పెండింగులో ఉన్న 927 దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్రదీపార్చన
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవ నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వెండిరథంపై ఆశీనులు చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు జాబ్ మేళా
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం ఆమె ఆవిష్కరించారు. పది, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వెంట విద్యార్హత పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు ఫొటోలు తెచ్చుకోవాలని, మరింత సమాచారం కోసం సెల్ : 94402 24291 నంబరును సంప్రదించాలన్నారు.
డ్యాంలో 120 టీఎంసీల నీరు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో సోమవారం సాయంత్రం సమయానికి 120.0754 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. డ్యాం పరిసరాల్లో ఆదివారం నుంచి సోమవారం వరకు 4.80 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పంప్‌మోడ్ ఆపరేషన్ ద్వారా 12,941 క్యూసెక్కుల నీటిని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుంచి మళ్లించారు. వర్షాధారంగా 4,713 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించారు. సోమవారం ఆయన కై లాసద్వారం, హఠకేశ్వరం, క్యూ కాంప్లెక్స్ తదితర ప్రదేశాలను సందర్శించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ అటవీశాఖ సహకారంతో భీమునికొలను మెట్ల మార్గం, కై లాసద్వారం వద్ద జంగిల్ క్లియరెన్స్, కైలాసద్వారం నుంచి హటకేశ్వరం వరకు ఉన్న జంగిల్ క్లియరెన్స్‌తో పాటు, రోడ్డుకు గ్రావెల్ పనులు చేయాలని సూచించారు. కై లాసద్వారం వద్ద చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్లు, మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్ధీకరణ పనులు ముందస్తుగా చేపట్టాలన్నారు. శ్రీశైల టీవీ ప్రసారాలు, అధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులు తిలకించేందుకు వీలుగా క్యూకాంప్లెక్స్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో దేవస్థాన ఇంజినీర్లు, శ్రీశైలం అటవీ శాఖ రేంజ్ అధికారి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment