అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారు
● నగళ్లపాడు పాల సొసైటీ డైరెక్టర్ల
ఎన్నిక ప్రక్రియను అడ్డుకోవడం తగదు
● న్యాయం కోసం కోర్టుకెళ్తాం
● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
చాగలమర్రి: అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా మారి పని చేస్తున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సాసీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. మండలంలోని నగళ్లపాడు గ్రామంలో సోమవారం విజయ డెయిరీకి చెందిన రిజిస్టర్డ్ పాల సొసైటీ డైరెక్టర్ల ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరగాలి. నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రస్తుత ఆ సొసైటీ చైర్మన్ గంగుల విజయసింహారెడ్డిని స్థానికేతరుడు అంటూ ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు, చాగలమర్రి ఎస్‌ఐ రమేష్‌రెడ్డి అడ్డుకున్నారు. అలాగే నామినేషన్ల స్వీకరణ జరగకుండా రిటర్నింగ్ అధికారి చండ్రాయుడును సైతం ఊర్లోకి రానివ్వకుండా నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంగుల అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియను అడ్డుకోవడం సరికాదన్నారు. సొసైటీలోని 20 ఓట్లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే ఉన్నాయని, దీంతో డైరెక్టర్లుగా వారే గెలుపొందుతారని అధికారపార్టీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఇందుకు పోలీసులు సహకరించడం తగదన్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించి ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, మండల అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment