గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో వినూత్న మార్పులు చేసింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మాతా, శిశు మరణాల రేటును పూర్తి స్థాయిలో తగ్గించే దిశగా చర్యలు తీసుకుంది. నాడు– నేడు కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించింది. సొంత భవనాలు లేని పలు కేంద్రాలకు అన్ని వసతులతో నూతన భవనాలు నిర్మించింది. మరికొన్నింటికి మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని అందుకు అంగన్‌వాడీ కేంద్రాలే వేదికని అప్పటి ప్రభుత్వం భావించింది. కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో విద్య నేర్పించడంతోపాటు మధ్యాహ్న భోజన వసతి, తల్లులకు పౌష్టికాహార కిట్లు అందిస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి భరోసా కల్పించింది. కేంద్రాల్లో 3–6 సంవత్సరాల్లోపు చిన్నారులకు సరికొత్త మెనూతో రుచికర వంటకాలతో భోజనం అందజేసింది. ఇందులో నాణ్యత లోపించకుండా అవసరమైన చర్యలు తీసుకుంది. ప్రస్తుత కూటమి పాలనలో పెరిగిన ధరలకు తోడు బిల్లులు అందకపోవడంతో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment