కోవెలకుంట్లలోని అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేస్తున్న చిన్నారులు
అంగన్‌వాడీ కేంద్రాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
నాలుగు నెలలుగా కూరగాయలు, నిత్యావసరాల బిల్లుల పెండింగ్
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెరగని మెస్ చార్జీలు
భారమవుతుందంటున్న అంగన్‌వాడీలు
సర్కారు నిర్వాకంతో మెనూ అమలు
కాక అర్ధాకలితో అలమటిస్తున్న పిల్లలు
గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల్లో రుచికర భోజనం
ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు..మరోవైపు పెరగని మెస్‌చార్జీలు..దీనికితోడు నెలల తరబడి అందని పాతబిల్లులు వెరసి అంగన్‌వాడీ కేంద్రాల్లో అప్పు చేసి పప్పుకూడులా మధ్యాహ్న భోజనం పథకం తయారైంది. దీంతో వాటిలో పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్న చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడం, పాత చార్జీలతోనే మెనూ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్‌వాడీ కేంద్రాలపై ధరల భారం పడింది. ఫలితంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా చిన్నారులకు రుచికర భోజనం అందించలేని పరిస్థితి నెలకొంది.
సొంత భవనాలు లేని అంగన్‌వాడీలు 200కు పైగా
నాలుగునెలల పెండింగ్ బిల్లుల మొత్తంరూ.40 లక్షలు
పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులు 39,462
జిల్లాలో మెత్తం అంగన్‌వాడీలు 1,663 భవనాల
రెండునెలల అద్దె బకాయి రూ.5 లక్షలు
కోవెలకుంట్ల: జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఎనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 1,620 అంగన్‌వాడీ కేంద్రాలు, 43 మినీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో సున్నా నుంచి 6 నెలల లోపు 16,548 మంది చిన్నారులు, ఏడు నెలల నుంచి ఏడాదిలోపు 14,698 మంది, సంవత్సరం నుంచి మూడేళ్లలోపు 50,137 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు 39,462 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. మూడు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఈ కేంద్రాలకు ప్రభుత్వం బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు సరఫరా చేస్తోంది. చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా ఎంతమేరకు సరుకులు అవసరమో వారందించే జాబితా ప్రకారం పంపిణీ చేస్తారు. కందిపప్పు, రేషన్‌బియ్యం ప్రతి నెలా చౌక దుకాణాల ద్వారా తెచ్చుకోవాల్సి ఉంది. సరకులు తరలించేందుకు, కేంద్రాల్లో జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి నగదు చెల్లించదు. అంగన్‌వాడీ కార్యకర్తలే అన్నీ భరించి తెచ్చుకోవాల్సి ఉంటుంది.
అద్దెభవనాల్లో మౌలిక సదుపాయాల కొరత
జిల్లాలో సొంత భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్దె భవనాలకు నెలకు రూ. 800 నుంచి రూ. వెయ్యి లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1500 నుంచి రూ. 2 వేలు బాడుగ చెల్లిస్తున్నారు. ప్రభుత్వం బాడుగ రూపంలో తక్కువ మొత్తం చెల్లిస్తుండటంతో ఎలాంటి మౌలిక వసతులు లేని చిన్నపాటి ఇళ్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, గాలి, వెలుతురు, మరుగుదొడ్లు, తదితర వసతులు లేని ఇళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలకు సైతం రెండు నెలల నుంచి బాడుగ చెల్లించపోవడం గమనార్హం. అరకొర వసతులున్న అద్దె భవనాల్లో కేంద్రాల నిర్వహణ భారంగా మారిందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment