గుట్టలపల్లి ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
ప్యాపిలి: మండల పరిధిలోని గుట్టలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరమణకు జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఎంఈఓ వెంకటేశ్ నాయక్ శుక్రవారం తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని గ్రామస్తులు ఆందోళన చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలకు డీఈఓ స్పందించినట్లు ఎంఈఓ తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడానికి కారణాలను మూడో రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.
తహసీల్దార్ జీతంజప్తునకు కోర్టు ఉత్తర్వులు
కర్నూలు: కోర్టు ఉత్తర్వులు అమలుపరచని కృష్ణగిరి తహసీల్దార్ జీతం జప్తునకు కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.మల్లేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. కర్నూలుకు చెందిన ఎం.తిరుపతయ్య నుంచి వీఆర్వో ఎం.పెద్ద మద్దిలేటి అప్పు తీసుకుని బాకీ పడ్డాడు. ఆ అప్పు చెల్లించేందుకు వీఆర్వో జీతం జప్తు చేయాలని 2020లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేయకుండా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘనకు పాల్పడిన తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసును జారీ చేసింది. అప్పటికీ స్పందన లేకపోవడంతో తహసీల్దార్ జీతాన్ని జప్తు చేయాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరెంజ్ బస్సుకు
రూ.4.43 లక్షల జరిమానా
డోన్ రూరల్: రోడ్ ట్యాక్స్ కట్టని ఆరెంజ్ బస్సుకు ఆర్టీఓ అధికారులు రూ.4.43 లక్షల జరిమానా విధించారు. ఆర్‌టీఓ క్రాంతికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రికార్డులు తనిఖీ చేయగా రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా తిప్పుతున్నట్లు గుర్తించి రూ.4,43,000 జరిమానా విధించారు. అనంతరం బస్సును ఆర్‌టీసీ డిపోకు తరలించారు. పర్మిట్, అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు రూ.82 వేల జరిమానా విధించారు.
మల్లన్నసేవలో ఐఏఎస్ అధికారి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కేంద్ర ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఐఏఎస్ అధికారి) సంజయ్‌కుమార్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఐఏఎస్ అధికారికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఆశీర్వచన మండపంలో ఐఏఎస్ అధికారికి వేదపండితులు వేదమంత్రాలు పలకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment