మద్దిలేటయ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి మార్గశిర మాసం శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా ఒక్క రోజే రూ.4,44,309 ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ రామాంజనేయులు తెలిపారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు భక్తులు గండదీపాలు మోసి మొక్కులు చెల్లించారు. వీరికి ఆలయ అర్చకులు నామధారణతో పాటు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అలాగే ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు చెందిన శాంతన్న, మల్లమ్మ జ్ఞాపకార్థం వారి మనవడు నవీన్ కుమార్ రూ.1,11,111 విరాళం అందజేశారు.
పాలేరు వాగు వద్ద చిరుత ప్రత్యక్షం
మహానంది: మహానంది సమీపంలోని పాలేరువాగు వద్ద శనివారం రాత్రి మరోసారి చిరుతపులి ప్రత్యక్షమైంది. కొందరు భక్తులు మహానందీశ్వరస్వామి దర్శనం చేసుకుని టూరిస్టు బస్సులో మహానంది నుంచి గాజులపల్లె మార్గంలో వెళ్తుండగా చిరుత కనిపించింది. బస్సు శబ్ధానికి అది సమీపంలోని పంటపొలాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. గత కొద్దిరోజుల క్రితం మహానందికి అతి సమీపంలోని గాజులపల్లె టోల్‌గేటు వైపు కనిపించిన చిరుతపులి, ఇది ఒకటేనా లేక మరొకటినా అంటూ స్థానికులు చర్చించుకున్నారు.
మహానందీశ్వరుడి దర్శన వేళల్లో మార్పులు
● మధ్యాహ్నం గంటన్నర విరామం
మహానంది: మహానందీశ్వరస్వామి దర్శనం వేళల్లో వైదిక కమిటీ సూచనల మేరకు స్వల్ప మార్పులు చేశారు. శనివారం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉదయం అష్టవిధ మహామంగళ హారతుల సమయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిరంతరాయంగా దర్శనం ఉండేదన్నారు. అయితే, స్వామికి మధ్యాహ్నం నివేదన అనంతరం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విరామం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దీంతో గంటన్నర పాటు భక్తులకు దర్శనం ఉండదని చెప్పారు. అనంతరం రెండు గంటల నుంచి యథావిధిగా దర్శనం కొనసాగుతుందన్నారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం ప్రభుత్వ సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment