863.80 అడుగులుగా డ్యాం నీటిమట్టం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల డ్యాం నీటిమట్టం శుక్రవారం సాయంత్రం సమయానికి 863.80 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 118.3380 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గురువారం నుంచి శుక్రవారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లైన నాగార్జునసాగర్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, కల్వకుర్తి ఎత్తిపోతల, హంద్రీనీవా సుజల స్రవంతికి 13,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 3.527 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. పంప్‌మోడ్ ఆపరేషన్ ద్వారా 7,594 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి మళ్లించారు.
శాస్త్రోక్తంగా తిరునక్షత్ర మహోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తిరునక్షత్ర మహోత్సవ పూజలు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ఽతిరుమజనం నిర్వహించారు. ధూపదీపాలతో మహా మంగళహారతి ఇచ్చారు.
నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు
నంద్యాల(రూరల్): జిల్లాలో సాగునీటి సంఘాలకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. కేసీ కెనాల్ పరిధిలోని 1,62,854 ఎకరాల ఆయకట్టు కింద 52 డబ్ల్యూఏ, 9 డీసీ, 1 పీసీ, ఎస్సార్బీసీ పరిధిలో 1,53,034 ఎకరాల ఆయకట్టు కింద 50 డబ్ల్యూఏ, 8 డీసీ, 1 పీసీ, తెలుగుగంగ పరిధిలో 1,29,412 ఎకరాల ఆయకట్టు కింద 47డబ్ల్యూఏ, 8 డీసీ, 1 పీసీ, శివభాష్యం పరిధిలో 12,092 ఎకరాల ఆయకట్టు కింద 7 డబ్ల్యూఏ, 1 పీసీ, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 40,056 ఆయకట్టు కింద 104 డబ్ల్యూఏ, మైలవరం పరిధిలో 740 ఎకరాల ఆయకట్టు కింద 01 డబ్ల్యూఏ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,98, 190 ఎకరాల ఆయకట్టు కింద 261డబ్ల్యూఏ, 25డీసీ, 4 పీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 3 లక్షలకు పైగా రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 17న డీసీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
కర్నూలు (లీగల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని న్యాయ స్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న రాజీ కాదగిన సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు అందరూ ఉపయోగించుకోవాలని, తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.
కుమారస్వామికి విశేషపూజలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామి ఉపాలయంలో శుక్రవారం కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు, అర్చకులు విశేషక్రతువులు నిర్వహించారు. కుమారస్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్య, అష్టోత్తరము చేసిన అనంతరం స్తోత్రపారాయణలు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి అభి
షేకంలో స్వామివారికి పంచామృతాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.
నేడు శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఈఓ విలేకరులతో మాట్లాడుతూ నేటి సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment