మహానందీశ్వరుడి ఆదాయం రూ.59.49 లక్షలు
మహానంది: మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన భక్తులు మహానందీశ్వరుడికి సమర్పించిన కానుకల ద్వారా రూ.59,49,355 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని సామూహిక అభిషేక మండపంలో శుక్రవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వారితోపాటు కోదండరామాలయం, వినాయకనంది, ఆంజనేయస్వామి, తదితర ఆలయాల ద్వారా రూ.57,94,430, అన్నప్రసాదం విభాగం ద్వారా రూ.1,26,829, గోసంరక్షణ ద్వారా రూ.28,096 వచ్చిందన్నారు. హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి పాల్గొన్నారు.
పల్లకీలో మహానందీశుడి దంపతుల విహారం
మహానందీశుడి దంపతులకు శుక్రవారం రాత్రి పల్లకీలో విహరించారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు ముందుగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులకు గణపతిపూజ, పుణ్యాహవాచనం, అలంకార పూజ, హారతులు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాకారాల్లో నిర్వహించిన పల్లకీసేవలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment