ఇసుక తోడేళ్లు!
● కుందూ నదిని తవ్వేస్తున్న తెలుగు తమ్ముళ్లు ● ప్రొక్లెయిన్లు పెట్టి ఇసుక తరలింపు ● ట్రాక్టర్ ట్రిప్పు రూ. 1,800 విక్రయం ● నెలకు రూ. 80 లక్షల ఇసుక వ్యాపారం ● చోద్యం చూస్తున్న అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్ల అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుక, మద్యం, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందూనది తీరంలో ఇటీవల కాలంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. ఉచిత ఇసుక పాలసీ పేరుతో నది తీరంలో ఇసుకను తవ్వేసి అక్రమ రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు చేతులెత్తేశారు. రాజకీయ ఒత్తిడి కారణంగా తామేమి చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. రెవెన్యూ అధికారుల అనుమతితో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చనే నిబంధన ఉంది. దీన్ని సాకుగా చేసుకుని కోవెలకుంట్లకు చెందిన కొందరు టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి ఇసుకదందా సాగిస్తున్నారు. నది పరివాహకంలో ఏకంగా ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం, పెద్దపెద్ద గోదాముల ఏర్పాటు, తోతట్టు ప్రాంతాల చదును తదితర వాటికి విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 1,500 నుంచి రూ. 1,800 చొప్పున రోజుకు వంద నుంచి 150 ట్రాక్టర్ల ఇసుక అమ్ముతున్నారు. ఈ దందా ద్వారా నెలకు రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. విచ్చలవిడిగా ఇసుక తరలింపుతో నదితీరంలో పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. ఇసుక దందా ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నదితీరంలో ఇసుకను వెతుకలాడే పరిస్థితులు ఉంటాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరకట్టను వదలని తెలుగు తమ్ముళ్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కుందూనది విస్తర్ణ పనుల్లో భాగంగా నదిలో పూడికతీత పనులు చేపట్టి మట్టిని(బెలుకు) నది ఒడ్డున కరకట్టగా ఏర్పాటు చేసింది. వర్షాకాలంతో నదికి వరద ఎక్కువ వచ్చినా నదితీర గ్రామాలు, పొలాలు మునగకుండా అడ్డుకట్ట వేసింది. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో కుందూనది విస్తరణ పనులు జరిగాయి. ఆరునెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చనేతలు మట్టికట్టను సైతం వదలకుండా తవ్వకాలు జరుపుతున్నారు. సూర్యుడు అస్తమించగానే మట్టిమాఫియా మేలుకుంటోంది. పగటి వేళ్లల్లో కాకుండా రాత్రి వేళల్లో ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని కట్టను తవ్వి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ట్రాక్టర్ బెలుకును రూ. వెయ్యి నుంచి రూ. 12 వందల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్ల సాయంతో మట్టిని తరలిస్తుండటంతో కట్ట బలహీన పడింది. వచ్చే ఏడాది వర్షాకాలంలో నదికి వరదనీరు చేరితే పంటపొలాలు, గ్రామాల్లోకి వరదనీరు చేరే ఆస్కారం ఉందని నదితీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కుందూతీరంలో ఇసుక, కరకట్ట మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment