నిర్ణీత కాలవ్యవధిలో అర్జీలకు పరిష్కారం
● రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి వినతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి ● అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశం
నంద్యాల: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు నిర్ణీ
త కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో కలిసి కలెక్టర్ తన చాంబర్ నుంచి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించదగ్గ సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించి సంబంధిత నివేదికలు పంపాలన్నారు. అలాగే స్వీకరించిన అర్జీలకు సంబంధించిన రసీదు లు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కార మార్గం సూచించాలన్నారు. ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డు రూములు సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ, ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో మత్స్య వినియోగాన్ని పెంచండి
జిల్లాలో మత్స్య వినియోగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె తన చాంబర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య వినియోగంతో పాటు వనరులు అభివృద్ధి చేయాలన్నారు. మత్స్య సంపద యోజన పథకం కింద ఫిష్ సీడ్స్ స్టాకింగ్, టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్, మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ ఏర్పాటు తదితర వివరాలు అడిగి తెలుసుకొని ఆక్వా హబ్ ఏర్పాటుకు కూడా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చేప పిల్లల పెంపక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అనువైన భూమిని, ఔత్సాహికులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. చేపల పెంపకం అత్యల్పంగా నంద్యాల జిల్లాలోనే ఉందన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment