పట్టుపురుగులపై పురుగుమందుల ప్రభావం
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపించని
మల్బరీ సాగు
● నామమాత్రపు రాయితీలతో
సాగుకు దూరంగా రైతులు
● పట్టు గూళ్ల ధరల్లో కూడా
పెరుగుదల శూన్యం
● స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): మల్బరీ తోటల సాగుపై, పట్టు పురుగుల పెంపకంపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ఆదోని ప్రాంతంలోని దొడ్డనగేరి, జాలిమంచి, కోసిగి, ఇస్వీ ప్రాంతాల్లో గతంలో ఎటు చూసినా మల్బరీ తోటలు ఉండేవి. ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. అయితే క్రమంగా ఈ ప్రాంతంలో మల్బరీ సాగు తగ్గుతూ వచ్చి నేడు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న పట్టుపరిశ్రమల శాఖ ఏడీ కార్యాలయాన్ని ప్యాపిలికి మార్చారు. అక్కడ కూడా మల్బరీ సాగు తగ్గడంతో కార్యాలయం కర్నూలుకు వచ్చింది. గతంలో వెల్దుర్తి మండలం బోయినపల్లి, సూదేపల్లి, కోడుమూరు మండలం లద్దగిరి గ్రామాలు మల్బరీ సాగుకు నెలవుగా ఉండేవి. నేడు ఈ ప్రాంతాల్లో మల్బరీ సాగు కనిపించడం లేదు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో 2,000 ఎకరాల్లో మల్బరీ సాగు ఉండేది. ఆత్మకూరులో ప్రత్యేకంగా అసిస్టెంటు డైరెక్టర్ కార్యాలయం కూడా ఉంది. అయితే నేడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆత్మకూరు ఏడీ పరిధిలో 50 ఎకరాల్లో కూడా మల్బరీ సాగు కనిపించడం లేదు.
ఎందుకు ఇలా?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు 80 శాతంపైగా పడిపోయినా సెరికల్చర్, సహాయ సెరికల్చర్ ఆఫీసర్లు, సాంకేతిక సహాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు లేకపోవడం, పట్టుగూళ్ల ధరల్లో పురోగతి లేకపోవడంతో రైతులు పట్టుకు ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడి వ్యయం
పట్టు సాగులో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. పట్టు పురుగుల పెంపకానికి షెడ్ అత్యవసరం. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రభుత్వం గతంలో ఇస్తున్న సబ్సిడీ రూ.3 లక్షలే ప్రస్తుతం అందిస్తోంది. రెండు ఎకరాల్లో మల్బరీ మొక్కలకు రూ.45 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.5000. సూట్‌కు రూ.40 వేలు, వరండాకు రూ.30 వేలు, నేత్రికలకు రూ.50 వేలు ప్రకారం సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీలు పోను మొక్కలు నాటుకోవడానికి రైతులకు రూ.20 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.12 వేలు, సూట్‌కు రూ.1.50 లక్షలు, వరండాకు రూ.లక్ష, నేత్రికలకు రూ.10 వేలు, చాకి పురుగులకు ఏడాదికి రూ.50 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.20 లక్షల వరకు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రూ.4.80 లక్షలు సరిపోవడం లేదు. పట్టుగూళ్లకు హిందూపురం, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో రైతులకు నికరాదాయం రావడం లేదు.
మల్బరీ తోట
ఏడెనిమిదేళ్లుగా కంది, పత్తి, మినుము, మిర్చి, మొక్క
జొన్న, వరి తదితర పంటల్లో పురుగు మందుల వాడకం భారీగా పెరిగింది. ఈ ప్రభావం చుట్టుపక్కల ఉన్న పట్టు పురుగులపై పడుతోంది. పట్టు పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి. గాలి వాటంగా వస్తున్న పురుగుమందుల ప్రభావానికి లోనై మరణిస్తున్నాయి. డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామం పరిసరాల్లో రెండు, మూడేళ్ల క్రితం ఫెస్టిసైడ్ కంపెనీ ఏర్పాటు అయింది. దీని ప్రభావం వెల్దుర్తి మండలం సూదేపల్లిలో సాగు చేస్తున్న పట్టు పరిశ్రమపై పడుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోతుండటానికి పురుగు మందుల పిచికారీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. గతంలో కిలో పట్టుగూళ్లకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తుంటే నేడు కూడా అదే ధర పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment