ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మంటలు
● ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం
బొమ్మలసత్రం: అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుక టైర్ పేలి మంగళవారం వేకువజామున మంటలు వ్యాపించాయి. బస్సు తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపి ప్రాణ నష్టం కాకుండా జాగ్రత్తపడ్డాడు. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఎస్‌కే ట్రావెల్ బస్సు నిర్వాహకులు మకర పౌర్ణమి సందర్భంగా అరుణాచలం ప్రత్యేక టూర్‌ను ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న 35 మంది ప్రయాణికులతో ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది. సోమవారం అరుణాచలం దర్శనానంతరం రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం వేకువజామున నంద్యాల శివారులోని చాపిరేవుల టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే వెనుకు టైర్ పేలి మంటలు వ్యాపించాయి. టోల్ ప్లాజా సమీపంలో ఉన్నందున డ్రైవర్ బస్సును తక్కువ వేగంతో నడుపుతుండటంతో మంటలు గమనించి వెంటనే రహదారి పక్కన నిలిపేశాడు. బస్సులో పొగ కమ్ముకోవటంతో నిద్రపోతున్న ప్రయాణికులు ఆందోళన చెందారు. డ్రైవర్ సూచనలతో ప్రయాణికులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. టోల్‌ప్లాజా సిబ్బంది సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ట్రావెల్ నిర్వాహకులు ప్రయాణికులను మరో వాహనంలో నంద్యాల నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment