రోడ్డుప్రమాదంలో బాలుడి దుర్మరణం
వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిలకు చిన్న కుమారుడు గిరిచరణ్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో గిరిచరణ్ ఉదయాన్నే తన పెద్దనాన్న ఆంజనేయులు హైవే–44 పక్కన నిర్వహిస్తున్న వాటర్ సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. కాసేపు ఉండి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. లిమ్రాస్ ఫంక్షన్ హాల్ పక్కదారి నుంచి వెళ్లేందుకు విద్యుత్ సబ్‌స్టేషన్ దాటు కుని నర్సరీ ఎదురుగా జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కర్నూలు వైపు నుంచి డోన్ వైపు వెళ్తున్న తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో ఎగిరిపడిన గిరిచరణ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆ స్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ దేవేంద్రన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని యువకుడు..
బొమ్మలసత్రం: నంద్యాలలోని శ్రీనివాససెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున డివైడర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో అత్తార్ అస్లామ్(26) మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు.. శిరివెళ్ల మండల కేంద్రానికి చెందిన అత్తార్ అస్లామ్ మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కాకాని కళ్యాణ్ స్నేహితులు. ఇద్దరూ కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి గ్రామానికి వెళ్లేందుకు శ్రీనివాససెంటర్ వైపు బయలుదేరారు. శ్రీనివాససెంటర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న అత్తార్ అస్లామ్‌కు బలమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న కళ్యాణ్ తీవ్రగాయాలపాలు కావటంతో బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాణం తీసిన ఈత సరదా
ఎమ్మిగనూరు రూరల్: గుడేకల్ చెరువులో బుధవారం ఈతకు వెళ్లి రవి(15) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కడివెళ్ల గ్రామానికి చెందిన పెద్దయ్య, మంగమ్మ దంపతుల కుమారుడు రవి సరదాగా ఈత కోసమని గుడేకల్ చెరువు వద్దకు వచ్చాడు. చెరువులోకి దిగి ఈత కొడుతూ కాస్త లోపలకు వెళ్లాడు. ఈక్రమంలో మునిగిపోయాడు. అక్కడ ఉన్న వా రు గమనించి వెళ్లి గాలించినా ఆచూకీ కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కొద్దిసేపటి తరువాత రవి మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. బాలుడు మృతితో కుటంబంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment