జ్వాలనరసింహుడి గర్భాలయ ద్వారానికి వెండి కవచం
● రూ. 30 లక్షలతో చేయించిన భక్తుడు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం జ్వాలనరసింహ స్వామి గర్భాలయానికి నంద్యాలకు చెందిన భక్తుడు రూ. 30 లక్షలతో వెండి కవచం చేయించాడని దేవస్థాన మేనేజర్ రాంభూపాల్ తెలిపారు. నంద్యాలకు చెందిన శ్రీ హనుమాన్ హార్డ్‌వేర్ దుకాణ నిర్వాహకుడు వెంకటసుబ్బయ్య శెట్టి తన మొక్కుబడిలో భాగంగా రూ. 30 లక్షలతో సుమారు 27 కిలోలతో ద్వారానికి వెండి తొడుగులు చేయించారన్నారు. వాటిని ఆలయ ద్వారాలకు గురువారం అలంకరించామన్నారు.
శ్రీశైలం నుంచి 7,430 క్యూసెక్కులు విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం నుంచి గురువారం వరకు దిగువ ప్రాజెక్ట్‌లకు 7,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా సుజలస్రవంతికి 1,702 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 338, ముచ్చమర్రి ఎత్తిపోతలకు 490, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2,500, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రానికి జలాశయంలో 96.2698 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 856.70 అడుగులకు చేరుకుంది.
అప్రెంటిస్‌కు అభ్యర్థుల ఎంపిక
● 25న ధ్రువీకరణ పత్రాల పరిశీలన
కర్నూలు(అర్బన్): కర్నూలు ఏపీఎస్‌ఆర్‌టీసీలో 2024–25 సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆర్‌టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నజీర్ అహ్మద్ తెలిపారు. డీజిల్ మెకానిక్, మోటారు మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్ ట్రేడ్ల వారీగా ఎంపికై న వారి సీరియల్ నంబర్లను ఆయన గురువారం ప్రకటించారు. ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ, ఐటీఐతో పాటు ఎస్టీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రాలను (పర్మినెంట్ సర్టిఫికెట్ లేని పక్షంలో ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధ్రువీకరణ పత్రం ) తీసుకురావాలన్నారు. అలాగే వికలాంగులు తమ వైకల్య ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటలకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్‌లో హాజరు కావాలన్నారు. ఈ ఫలితాల అధికార నిర్ధారణ కోసం జోనల్ ట్రైనింగ్ కాలేజ్, డిపోల నోటీసు బోర్డుల్లో ఉంచామని వివరించారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు (సిటీ): జవహర్ నవోదయ విద్యాలయం 2025–26 సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 18వ తేదీన నిర్వహించే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సి.బెళగల్ ఎంఈఓ–2 కె.ఆదాం బాషా, బన వాసి నవోదయ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహణపై గురువారం స్థానిక మాంటిస్సోరి స్కూల్‌లో సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 6,035 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారని, కర్నూలులో 13, నంద్యాలలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలో ఎలాంటి తప్పు లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. 18వ తేదీ 11.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment