శ్రీశైలంలో శాస్త్రోక్తంగా యాగ పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారి యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించారు. అనంతరం వసంతోత్సవం జరిపించారు. చండీశ్వరస్వామికి సరస్వి పుష్కరిణిలో అర్చకులు, ఈఓ ఎం.శ్రీనివాసరావు శాస్త్రోక్తంగా అవబృథస్నానం నిర్వహించారు.
● సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి కార్యక్రమాలను నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులు వేదస్వస్తి చేశారు. నాగవల్లి కార్యక్రమంలో సంక్రాంతి పర్వదినాన కల్యాణోత్సవం జరిపించిన అమ్మవారికి ఆగమశాస్త్ర సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు.
● సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఆలయ ధ్వజస్తంభంపై అవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేశారు.
● శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు అశ్వవాహనసేవలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ జరిపిస్తారు. ఆయా ఉత్సవాలతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
వేదపారాయణం
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మూడు గంటల పా టు నిరంతరాయంగా వేదపారాయణలు కొనసాగా యి. దేవస్థాన పండితులతో పాటు సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ ఆలయం, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి–విజయవాడ దేవస్థానాల నుంచి వచ్చిన పండితులు, తిరుపతి, హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు పండితులు పాల్గొన్నారు. రుత్విగ్వరణ కార్యక్రమంలో పండితులకు నూతన వస్త్రాలు అందజేశారు. దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న
సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment