మంత్రి బీసీ అనుచరుల వీరంగం
● అనుమతి లేకుండా పెళ్లి ఇంట్లోకి వెళ్లి అరాచకం ● భయంభ్రాంతులకు గురిచేసినా పట్టించుకోని పోలీసులు ● దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె రూరల్: రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అనుచరులు బనగానపల్లె పట్టణంలో దౌర్జన్యం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యులు అబ్దుల్‌ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్‌ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్‌ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు. అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్‌ల పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ అక్కడి నుంచి స్థానిక పోలీసు స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే చేరుకొని, పెళ్లి ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ దుగ్గిరెడ్డిని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణాకు కూడా ఫిర్యాదు చేయనున్నటు కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. కాగా పోలీసు స్టేషన్ వద్దకు ముస్లింలు పెద్ద ఎత్తున చేరుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తన ఇంట్లోకి అనుమతి లేకుండా విష్టు, నరసింహ అనే వ్యక్తులు ప్రవేశించినట్లు, కెమెరామెన్స్‌పై దాడికి పాల్పడినట్లు అబ్దుల్‌ఫైజ్ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ దుగ్గిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment