BJP Win: బీజేపీ బిగ్‌ విన్‌.. రెండు రాష్ట్రాల్లో జయకేతనం | BJP Win In Rajasthan And Madya Pradesh Assembly Elections | Sakshi
Sakshi News home page

BJP Win: బీజేపీ బిగ్‌ విన్‌.. రెండు రాష్ట్రాల్లో జయకేతనం

Published Sun, Dec 3 2023 10:53 AM | Last Updated on Sun, Dec 3 2023 1:27 PM

BJP Win In Rajasthan And Madya Pradesh Assembly Elections - Sakshi

భోపాల్‌/జైపూర్‌: నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉండగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. రాజస్థాన్‌లో ప్రతీ ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే అనవాయితీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న  విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే అనవాయితీని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టి బీజేపీకి పట్టం కట్టారు ఓటర్లు. 

అయితే, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కూడా ప్రభావం చూపించలేకపోయింది. స్థానిక కాంగ్రెస్‌ నేతల్లో విభేదాలు కూడా హస్తం పార్టీ ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక, రాజస్థాన్‌లోకి గెహ్లాట్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను బీజేపీ బలంగా ముందుకు తీసుకెళ్లింది. ఇక, ప్రధాని మోదీ సహా బీజేపీ జాతీయ నేతలు కూడా రాజస్థాన్‌లో గట్టిగానే ప్రచారం చేశారు. 

‘మహిళలపై నేరాలు’ ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ఆరోపించారు. 

గణాంకాలు ఇవీ..
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం.. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17 శాతం పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2 శాతం తగ్గడం గమనార్హం. 

ఇక, మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ దళిత యువతిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం మరోసారి బీజేపీకి అనుకూలంగానే ఓట్లు వేయడం విశేషం. కాంగ్రెస్‌లోని సీనియర​్‌ నేతల మధ్య విభేదాలు కూడా హస్తం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement