ఎంపిక షురూ..!
భైంసాటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజాపాలనలో దరఖాస్తుల ఆధారంగా స్కృటినీ అయిన తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన జాబితా అధికారుల చేతికి అందింది. ఈ మేరకు ఆ జాబితా ఆధారంగా అధికారులు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. ఈనెల 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ, వార్డు సభల్లో వివరాలు వెల్లడిస్తూ, జాబితా ఆమోదం పొందేలా చూడాలి. ఆమోదం పొందిన జాబితా ఆధారంగా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. తుది జాబితా ఆధారంగా అర్హులైనవారికి 26 నుంచి పథకాల ప్రయోజనం చేకూరనుంది.
కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు..
కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇటీవల జరిపిన కులగణన ఆధారంగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 17,491 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు జాబితా అందించారు. డూప్లికేట్, డబుల్ రేషన్ కార్డులు జారీ కాకుండా పరిశీలన చేయాలని ఆదేశాలున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
గ్రామ, వార్డు సభలే కీలకం...
ఈనెల 20లోగా నాలుగు పథకాలకు సంబంధించి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను, గ్రామ, వార్డు సభల్లో వెల్లడించి, గ్రామసభ ఆమోదం పొందిన తీర్మానాలను భద్రపరచాలని ఆదేశాల్లో సూచించారు. గ్రామసభల నిర్వహణకు రెండురోజుల ముందే సంబంధిత గ్రామాలు, వార్డు ప్రజలకు సమాచారమివ్వాలి. 24వ తేదీ వరకు గ్రామసభలు కొనసాగనున్నాయి. దీంతో నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభలే కీలకం కానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాగానే, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నాలుగు పథకాలను అమలు చేయనుంది.
26 నుంచి నాలుగు పథకాల అమలుకు కసరత్తు
20 వరకు క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన
21 నుంచి గ్రామసభల్లో ఆమోదం
అర్హులకే ఆత్మీయ భరోసా..
రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. భూభారతి(ధరణి) పోర్టల్‌లో నమోదైన సాగుయోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా అర్హులను గుర్తించనున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, వ్యవసాయ అధికారి నేతృత్వంలో, గ్రామస్థాయిలో ఏఈవో, రెవెన్యూ అధికారులతో కమిటీగా ఏర్పడి విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా సాగు యోగ్యమైన భూములను నిర్ధారిస్తారు. 20లోపు క్షేత్రస్థాయి సందర్శన పూర్తి చేసి, 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో వివరాలను వెల్లడిస్తూ, గ్రామసభ ఆమోదం పొందిన తరువాత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయనున్నారు.
ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు అందించేందుకు 2023– 24 సంవత్సరంలో కనీసం 20 రోజు లపాటు ఉపాధి హామీ పనులు చేసినవారు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. లబ్ధిదా రుల గుర్తింపులో ఎంపీడీవోలు, ఏపీవోలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. దీంతో అసలైన రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment