సమగ్ర పరిశీలన తర్వాతే అర్హుల జాబితా రూపొందించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి గ్రామ, వార్డు సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి అధికారులు గుర్తించిన లబ్ధిదారుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపికను ఈనెల 19వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులను గుర్తించాలన్నారు. నూతన రేషన్ కార్డుల జారీకి కుటుంబ ఆదాయం, భూములు వంటి విషయాలను ప్రమాణికంగా తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించి అర్హులను గుర్తించాలన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి పంటలు గు చేస్తున్న భూములను పారదర్శకంగా గుర్తించాలన్నారు. సాగుకు యోగ్యం కానీ భూములు, గుట్టలు, వెంచర్లు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రైల్వేలైన్, రహదారుల కోసం తీసుకున్న తదితర భూముల వివరాలు జాబితాలో ఉండొద్దని తెలిపారు. అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా పూర్తి పారదర్శకత, నిబద్ధతతో క్షేత్రస్ధాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు సర్వే పూర్తికాని అర్హులందరూ ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో తమ వివరాలు తెలియజేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 6305646600 ను సంప్రదించాలన్నారు. సమావేశంలో నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డిలు, జెడ్పీ సీఈవో గోవింద్, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డిఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డీఎస్‌వో కిరణ్‌కుమార్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment