వేతనాల కోసం ఎదురుచూపు
● పంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా అందని వైనం.. ● విడుదల చేయాలని వేడుకోలు
లక్ష్మణచాంద: ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు నిత్యం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికులదే కీలక పాత్ర. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,564 మంది..
జిల్లాలో 400 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 1,564 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వీరికి వేతనాలు అందలేదు. వేతనాల కోసం మండల కేంద్రాల్లో ఆదోళనలు చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచిగానీ, ఉన్నతాధికారుల నుంచిగానీ స్పందన లేదు.
ఒక్కో పంచాయతీలో ఒక్కోరకంగా...
జిల్లాలో కార్మికుల వేతనాల చెల్లింపులు ఒక్కో పంచాయతీలో ఒక్కోరకంగా ఉన్నాయి. పెద్ద పంచాయతీలకు నిధులు ఎక్కువగా ఉండటంతో పంచాయతీ కార్మికులకు వేతనాలు ఉన్న నిధుల నుంచి ట్రాక్టర్‌కు చెల్లించే కిస్తీ, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటివి పోను మిగిలిన నిధుల నుంచి కార్మికులకు వేతనాలు ఇస్తున్నారు. చిన్న పంచాయతీలకు తక్కువ ఆదాయం ఉండడంతో వచ్చిన ఆదాయంలో ట్రాక్టర్ కిస్తీ, విద్యుత్ బిల్లు పోను ఎలాంటి నిధులు మిగలడం లేదు. దీంతో కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు.
అప్పుల పాలవుతూ...
జిల్లాలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల కు నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడానికి అప్పులు చేస్తున్నామని కార్మికులు అంటున్నారు. తమకు రావాల్సిన నాలుగు నెలల వేతనాలు విడుదల చేసితమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇబ్బంది లేకుండా చూస్తాం
గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నుంచి నాలుగు నెలల వేతనాలు రావాల్సి ఉంది. పంచాయతీలో ఉన్న నిధులు, ఆస్తి పన్ను రూపంలో వచ్చిన డబ్బుల నుంచి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కార్యదర్శులకు సూచించాం. కార్మికలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment