తెగులు.. దిగులు
కుంటాల: ఏటా మిర్చి రైతుకు కష్టాలు తప్పడం లేదు. వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంటకు తెగులు సోకడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇప్పటికే మద్దతు ధర లేకపోవడం, దిగుబడి ఆశించిన మేరకు రాకపోవడంతో జిల్లాలో పత్తి సాగు గణనీయంగా తగ్గింది. సాగు చేసిన కొద్దిపాటి రైతులు కూడా తెగుళ్లతో దిగులు చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 288 ఎకరాల్లో 221 మంది రైతులు మిర్చి సాగు చేశారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 2,650 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, మిర్చికి తెగుళ్లు సోకడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. విత్తనం మొలకెత్తినప్పటి నుంచి ఏపుగా పెరిగిన మిర్చి పచ్చగానే కనిపించి పూత, కాత దశకు రాగానే ఎండుకుళ్లు, ఎర్రనల్లి ఆశిస్తున్నాయి. దీంతో పంట ఎండుముఖం పట్టి దిగుబడి తగ్గుతోంది. కాయలు నల్లబడుతున్నాయి.
తగ్గిన ధర..
ఇక ఈ ఏడాది మిర్చి ధర కూడా తగ్గింది. గతేడాది క్వింటాల్‌కు రూ.19 వేల నుంచి రూ.22 వేలు పలికింది. ఈ ఏడాది మార్కెట్‌లో రూ.14,500 నుంచి రూ.15,500 వరకు ఉంది. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. దిగుబడి తగ్గిపోవడం, ధర కూడా పడిపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల కారణంగా మిర్చి ఎకరాకు 15 క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ఖర్చులు పెరగడం, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సలహాలు పాటిస్తే మేలు..
మిర్చి పంటకు వేరుకుళ్లు తెగులు సోకకుండా అధికారులు సూచనలు చేస్తున్నారు. మిర్చి రైతులు విత్తనం వేసేటప్పుడు నారుమడిలో వేప నూనెతో కలియదున్నాలి. కాపర్ ఆక్సిక్లోరిఫై లీటరు నీటిలో 3 గ్రాములు వేరు మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. రెడోమిల్ 1గ్రాము లీటర్ నీటితో పిచికారీ చేస్తే పంటలను కాపాడుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఎర్రబంగారానికి వేరుకుళ్లు
పంట దిగుబడిపై ప్రభావం
ఆందోళనలో మిర్చి రైతులు
సలహాలు పాటించాలి...
గతేడాది కంటే ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఎండు వేరుకుళ్ళు తెగులు సోకుతున్న కారణంగా పంట ఎండిపోతోంది. రైతులు పంటకు కాలువల ద్వారా ఎక్కువ నీటి తడులు ఇవ్వొద్దు. సూచనలు, సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది.
– కేబీ.రమణ, జిల్లా ఉద్యానవన అధికారి
పంట ఎండుముఖం పట్టింది..
విత్తనం మొలకెత్తినప్పటి నుంచి కాయ వచ్చే వరకు పంట బాగానే ఉంది. ప్రస్తుతం వేరుకుళ్లు సోకడంతో పంట అంతా ఎండిపోయింది. దీంతో చెరిపి వేసి వేరే పంట వేశాను. ప్రభుత్వం ఆదుకోవాలి.
గంగాప్రసాద్, మిర్చి రైతు
Comments
Please login to add a commentAdd a comment