ఖతాల్లో నిధులు.. ఖర్చులపై ఆంక్షలు!
● మున్సిపాలిటీలకు నిధులు ● జిల్లాకు రూ.10.25 కోట్లు ● ఐదేళ్ల బకాయిలు ఖాతాల్లో జమ ● నిధుల ఖర్చుకు మార్గదర్శకాలు
నిర్మల్‌చైన్‌గేట్: నిధులు లేక నీరసించిపోతున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంపు డ్యూటీ, ఆస్తి మార్పిడి రుసుము నుంచి రావాల్సిన బకాయి నిధులను ఇటీవల విడుదల చేసింది. 2019 నుంచి స్టాంపు డ్యూటీ, 2022 నుంచి ఆస్తి మార్పిడి రుసుము ద్వారా వచ్చిన పన్ను బకాయిల వాటాను జిల్లాలోని 3 మున్సిపాలిటీల ప్రత్యేక ఖాతాల్లో జమచేసింది. దీంతో మున్సిపాలిటీలకు ఊరట లభించింది.
ప్రతీ రిజిస్ట్రేషన్‌పై 0.5 శాతం..
మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ స్థలాలు, వాణిజ్య భవనాలు, నివాస భవనాల క్రయ, విక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్లు అయితే.. 0.5 శాతం స్టాంప్ డ్యూటీ ఆయా మున్సిపాలిటీలకు చెందాలి. గతంలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మున్సిపాలిటీల ఖాతాల్లో ఆ మొత్తం జమయ్యేవి. 2019 నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తేవడంతో అప్పటి నుంచి మున్సిపాలిటీలకు రావల్సిన స్టాంప్ డ్యూటీ డబ్బులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి. దీంతో ఐదేళ్లుగా స్టాంప్ డ్యూటీ డబ్బులు నిలిచిపోయాయి. ఫలితంగా బల్దియాలకు ఆదాయం తగ్గింది. మున్సిపాలిటీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ డబ్బులు చెల్లించాలని మున్సిపల్ చైర్మన్లు ప్రభుత్వానికి విన్నవించడంతో సానుకూలంగా స్పందించింది. ఇటీవల స్టాంప్ డ్యూటీ డబ్బులు మున్సిపాలిటీల ఖాతాల్లో జమచేసింది. దీంతో జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు కలిపి రూ.10.25 కోట్లు మంజూరయ్యాయి.
గతంలో 4 శాతం నిధులు..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్ డ్యూటీని గతంలో 4 శాతం స్థానిక సంస్థల ఖాతాల్లో నేరుగా జమ చేసేవారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిధులను మున్సిపాలిటీలకు ఇవ్వకుండా ప్రభుత్వం నేరుగా తీసుకుంది. ఆ తర్వాత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో ప్రతినెలా కొన్ని నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. వీటితో ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాలను నిలిపివేశారు. నిధులులేక మున్సిపాలిటీల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికే పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
మార్గదర్శకాల ప్రకారమే..
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూటీ డబ్బులు విడుదల చేసింది. ఐదేళ్ల స్టాంప్ డ్యూటీ డబ్బులు నిర్మల్‌కు రూ.5.10 కోట్లు వచ్చాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఈ నిధులను ఖర్చు చేస్తాం.
– ఖమర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం
వేతనాలు.. కరెంటు బిల్లులకే..
ప్రభుత్వం మున్సిపాలిటీలకు స్టాంప్ డ్యూటీ బకాయిలను విడుదల చేయడంతోపాటు వాటి ఖర్చుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు, కార్యాలయాల కరెంట్ బిల్లుల చెల్లింపులు, ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వార్డుల్లో సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రెయినేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది.
తీవ్ర నిరాశలో పాలకవర్గాలు..
నిధుల వినియోగంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారు. ఈనెల 27న మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, వార్డుల్లో చేయాల్సిన పనులకు నిధుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. విడుదలైన స్టాంప్ డ్యూటీ నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో పాలకవర్గాలు తీవ్ర నిరాశకుగురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment