పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు ఆత్మహత్య
ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
పెనమలూరు: పెళ్లి పీటలు ఎక్కాల్సిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మృతి చెంటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం వణుకూరు కరణంగారి బజార్‌లో డి.విజయలక్ష్మి కుటుంబం నివసిస్తోంది. విజయలక్ష్మి భర్త కృష్ణమూర్తి గత ఏడాది మృతి చెందాడు. కాగా వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అజయ్‌బాబు వివాహం చేసుకొని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు శ్రీనివాసరావు(34) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రసుత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వణుకూరులో ఉంటున్నాడు. శ్రీనివాసరావుకు ఇటీవల మంగళగిరి ఆత్మకూరుకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. వీరికి ఈ నెల 22వ తేదీన నిశ్చితార్థం చేయాల్సి ఉంది. కాగా శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం కొత్త బట్టలు కొనాలని తల్లితో చెప్పాడు. అదే రోజు ఉదయం ఇంటి పై అంతస్తులో తను ఉంటున్న గదిలో వర్కు చేశాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మరలా వర్కు చేయటానికి వెళ్లాడు. అయితే సాయంత్రం శ్రీనివాసరావు కిందకు రాక పోవటంతో తల్లి తన మరిది వేణుగోపాలకృష్ణకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పై అంతస్తులో శ్రీనివాసరావు ఉంటున్న గది వద్దకు వెళ్లి చూశారు. శ్రీనివాసరావు లుంగీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతనిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. అయితే పెళ్లి కుదిరిన శ్రీనివాసరావు ఎందుకు ఉరేసుకొని చనిపోయాడనేది మిస్టరీగా మారింది. ఈ ఘటనపై విచారణ చేసి న్యాయం చేయాలని తల్లి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment