పెన్షన్లలో వ్యత్యాసాన్ని సరిచేయాలి
సెంట్రల్, స్టేట్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్
అధ్యక్షుడు వెంకటప్పయ్య
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేయాలని సెంట్రల్, స్టేట్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కె.వెంకటప్పయ్య డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో 42వ అఖిల భారత పెన్షనర్ల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటప్పయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే 8వ వేతన సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. గౌరవాధ్యక్షుడు కె.హనుమంతరావు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. వి.సీతారామారావు, మోపిదేవి సీతారామయ్య, న్యూరాలజిస్ట్ ఎస్.బాలకృష్ణ ప్రసంగించారు. అనంతరం పెన్షనర్లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యదర్శి టి.వి. కృష్ణారావు, కోశాధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రీమియం లిక్కర్ స్టోర్‌లకు దరఖాస్తులు ఆహ్వానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రీమియం లిక్కర్ స్టోర్‌ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా మద్యనిషేధ, ఆబ్కారీ అధికారి శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరంలో రెండు ప్రీమియం లిక్కర్ స్టోర్‌లు మంజూరయ్యాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 గడువు తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తు ఫీజు రూ. 15లక్షలు(నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. నిర్ణీత గడువు లోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment