పుస్తకాలు చదవడం అలవాటుగా మారాలి
‘డబ్బు అమ్మబడును’ పుస్తకావిష్కరణలో అతిథులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యువత పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహిత వేంపల్లి షరీఫ్ చెప్పారు. పీబీ సిద్ధార్థ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ఏరువ శ్రీనాథ్‌రెడ్డి రచించిన ‘డబ్బు అమ్మబడును’ కథా సంపుటి పుస్తకాన్ని కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వేంపల్లి షరీఫ్ మాట్లాడుతూ పాఠ్యాంశాలకు చెందిన పుస్తకాలతో పాటుగా గ్రంథాలయంలో ఉండే ఇతర పుస్తకాలను చదవడం యువత అలవాటు చేసుకోవాలని చెప్పారు. రచయిత బండ్ల మాధవరావు మాట్లాడుతూ చదువుకుంటూనే పుస్తకాలు చదవడం, డ్రాయింగ్ వేయడం, క్రీడలు ఇలా ఏదో ఒక అంశాన్ని ఇష్టంతో అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఒత్తిడిని జయించడానికి ఈ కళలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. పుస్తక రచయిత శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ చదివిన కళాశాలలోనే తాను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. కళాశాల గ్రంథాలయాధికారి వాణిశ్రీ, కళాశాల డీన్ రాజేష్ సి.జంపాల, అధ్యాపకులు శ్రీలత, ఎ.శాంతకుమారి, కావూరి శ్రీథర్‌తో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రచయిత శ్రీనాథ్‌రెడ్డిని సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment