ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లకు ఉపాధి కల్పించేలా ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని అమలు చేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు. త్వరలో హోటల్, వాహన యజమానులు, దేవదాయ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ప్యాకేజీని అమలులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరానికి చెందిన ట్యాక్సీ వాహన యజమానులు డ్రైవర్లకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అమలు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. టూరిజం ప్యాకేజీ ద్వారా పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చే ట్యాక్సీ యజమానుల అంగీకారంతో వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఒకటి, రెండు, మూడు రోజుల పర్యాటన కింద పర్యాటక కేంద్రాలను ఎంపిక చేసి ధర నిర్దారణ చేస్తామన్నారు. పర్యాటక కేంద్రాల వద్ద గైడ్ లను నియమించి వాటి విశిష్టతను పర్యాటకులకు వివరించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టూరిజం ప్యాకేజీలో పాల్గొనే ట్యాక్సీ డ్రైవర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను నిర్ధారిస్తామన్నారు. సమావేశంలో రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ అలీ, జిల్లా టూరిజం అధికారి ఎ. శిల్ప, ట్యాక్సీ యజమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment