నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలి
ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎస్‌కేఎం నాయకులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. రద్దు చేసిన చట్టాల్లోని విధానాలతోనే కొత్త చట్టాలు చేస్తోందని దుయ్యబట్టారు. వాటిలో భాగంగానే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, నూతన సహకార చట్టం, నూతన మార్కెట్ చట్టం తీసుకువస్తోందని, ఇవన్నీ కార్పొరేట్‌ల కోసమేనని విమర్శించారు. మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈనెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభూ బోర్డర్‌లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమావేశంలో రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వై.కేశవరావు (ఏపీఆర్‌ఎస్), కె.వి.వి.ప్రసాద్ (ఏపీ రైతు సంఘం), డాక్టర్ కొల్లా రాజమోహన్ (నల్లమడ రైతు సంఘం), ఎం. కృష్ణయ్య (ఏపీఆర్‌ఎస్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment