వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి
ఘంటసాల: రాష్ట్రంలోని వీఓఏ (యానిమేటర్స్)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారిత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కూటమి నేతలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్)ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రభుదాస్ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 27,837 మంది వీఓఏలు పని చేస్తున్నారని, 28 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించారు. అయినా తమకు ఉద్యోగ భద్రత లేదని పేర్కొన్నారు. వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నేరుగా తమ బ్యాంక్ ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని, కనీసం వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, అర్హులైన వీఓఏలకు సీసీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, అధికారుల వేధింపులు, బెదిరింపులకు అడ్డుకట్ట వేయాలని, వీఓఏలు చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో వారికి వీఓఏ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మూడేళ్ల కాలపరిమితి పూర్తయిన వీఓఏలను తొలగిస్తామని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నా రని ఆరోపించారు. కార్యక్రమంలో ఘంటసాల వీఏఓలు కొల్లూరి నాని, నాగమణి, ఇతర జిల్లాలకు చెందిన ఎ.వనజ, పి.యేసురత్నం, ఎం.గంగాదేవి, బి.రాణి, సి.కిరణ్ పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఉయ్యూరు: ఉరి వేసుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గండిగుంట శివారు వెంకటాపురంలో బుధవారం జరిగింది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు.. గండిగుంట శివారు వెంకటాపురంలో నివసించే పోలన శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె పోలన గీతామాధురి (15) ఆకునూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయ పనులకు, తల్లి లక్ష్మి విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో పనికి, ఇంటర్ చదువుతున్న అక్క కళాశాలకు వెళ్లారు. గీతామాధురి స్కూలుకు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనానికి ఇంటికి వచ్చింది. వంట గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనివాసరావుకు వంట గదిలో కుమార్తె ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. స్థానికుల సాయంతో కిందకు దించి చూసేసరికి మృతిచెందింది. బిడ్డ మృతదేహాన్ని చూసి శ్రీనివాసరావు భోరున విలపించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి, కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు గీతామాధురి భౌతిక కాయాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. పట్టణ ఎస్‌ఐ విశ్వనాథ్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment